logo

మనోళ్లే పనోళ్లు.. బినామీ వసూళ్లు

ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ నాయకులు.. ఎవరికి ఓటేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాల్లోని కొందరు అధికారులు మాత్రం.. ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో మరోసారి  సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించారు.

Published : 01 May 2024 04:45 IST

ఎంపీ ఎన్నికల పనులపై కన్నేసిన అధికారులు
బంధువుల పేరుతో దందా
ఈనాడు, హైదరాబాద్‌

ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలని రాజకీయ నాయకులు.. ఎవరికి ఓటేయాలని ఓటర్లు ఆలోచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాల్లోని కొందరు అధికారులు మాత్రం.. ఎన్నికల ఏర్పాట్ల పనుల్లో మరోసారి  సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించారు. ఖర్చుకు ఐదింతలు సంపాదించడం ఎలా అని లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని సర్కిళ్లలో అధికారుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు పోటీ ఉంది. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు రూ.లక్షలు వెనకేసుకున్నారు. ఇప్పుడు మాకూ అవకాశమివ్వండని’ తోటి ఉద్యోగులు గగ్గోలు పెడుతుండడంతో ఉన్నతాధికారులు తలలుపట్టుకుంటున్నారు.

టెండరుకే ‘టెండరు’..

హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ గతేడాది అక్టోబరు 28న ఎన్నికల పనులకు టెండరు పిలవాలని, లైసెన్సు ఉన్న గుత్తేదారులతో పనులు చేయించాలని సర్క్యులర్‌ ఇచ్చారు. ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌ తదితర జోనల్‌ కమిషనర్లు ఆ నిబంధనను పూర్తిగా అమలు చేయలేదు. ఈవీఎంలను భద్రపరిచే గదుల వద్ద ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు పనులు, ఇంజినీరింగ్‌ పనులకు టెండర్లు పిలిచారు.  శిక్షణ తరగతులకు భోజనాల సరఫరా,  సిబ్బంది నియామకం, టెంట్లు, ఎన్నికల సామగ్రి, జిరాక్సు మిషిన్లు- బీరువాల కొనుగోలు, ఈవీఎంల తరలింపు, వాహనాలను సమకూర్చడం తదితర పనులను నామినేషన్లపై బంధువులు, బినామీ గుత్తేదారులకు అప్పగించారు. ఇష్టానుసారం ఖర్చులు రాసుకుని.. ఆయా సంస్థల లెటర్‌ హెడ్‌లపై బిల్లులు తీసుకున్నారు.

ఎక్కడెక్కడ ఎవరెవరు..

  • ప్రస్తుతం ఎన్నికలు పార్లమెంటు నియోజకవర్గాలకు జరుగుతున్నప్పటికీ..ఏర్పాట్లు అసెంబ్లీ స్థానాలవారీగా జరుగుతాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు రెవెన్యూ శాఖ అధికారులు ప్రస్తుతం సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా ఉండగా.. జోనల్‌ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గాలకు ఏఆర్‌ఓలుగా పనిచేస్తున్నారు. డీఈఓ హోదాలో రోనాల్డ్‌రాస్‌ ఇచ్చిన ఉత్తర్వు హైదరాబాద్‌ జిల్లాకే వర్తిస్తుందని.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టెండరు లేకుండా పనులు చేద్దామని ఓ డిప్యూటీ ఇంజినీరు జోనల్‌ అధికారితో మంతనాలు చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. గతంలో సదరు ఇంజినీరు మురారి, వెంకటేశ్‌ తదితర బినామీ పేర్లతో భారీగా బిల్లులు పెట్టారనే విమర్శలున్నాయి.
  • ఎల్బీనగర్‌ జోనల్‌ పారిశుద్ధ్య విభాగంలోని డిప్యూటీ ఇంజినీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు భోజనాలు సరఫరా చేసి రూ.లక్షల బిల్లులు తీసుకున్నారని.. ఆ ఇంజినీరు ఇంటి గృహప్రవేశానికి అయిన భోజనాల ఖర్చునూ ఎన్నికల వ్యయంలో కలిపేశారనే విమర్శలున్నాయి.
  • కేంద్ర కార్యాలయం ఎన్నికల విభాగంలోని ఓ ఉన్నతాధికారి బంధువు భాగస్వామిగా ఉన్న సాయి ఎంటర్‌ప్రైజెస్‌కు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు అనేక పనులు అప్పగించారు. ప్రజాపాలన దరఖాస్తుల డిజిటలీకరణ, ఓటర్ల నమోదు, ఇతర పనుల్లో అవకతవకలకు పాల్పడినా ఆ సంస్థపై చర్యలు లేవు. సాయి, జోయ్‌, ఈశ్వర్‌ అనే సంస్థలకు ప్రస్తుతం పాతబస్తీలోని  ఎన్నికల ఏర్పాట్లను అప్పగిస్తున్నారని, మరో ముగ్గురు సహాయ మున్సిపల్‌ కమిషనర్లు సొంతంగా పనులు చేసేందుకు పోటీ పడుతున్నారని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓటరు సల్లగుండాలని..

పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతోంది.  ఎండలు అదిరిపోతున్నాయి. మండుటెండలో వెళ్లి ఓటు వేయాలా? అని కొందరు బద్ధకించి ఊరుకునే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎన్నికల అధికారులు.. ఓటర్లకు చల్లదనంతో ఉపశమనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల ప్రాంగణాల్లో టెంట్లు, టెంట్ల కింద కుర్చీలు, కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నారు. గదుల్లో ఉండే ఎన్నికల సిబ్బందికి ఫ్యాన్ల కొరత లేకుండా చూడాలని నిర్ణయించారు. చల్లటి క్యాన్లలో నీరు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇలా ఓటర్లు ఎండలకు ఇబ్బంది పడకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, శేరిలింగంపల్లి


సారూ.. ఎంతిస్తారూ..

మండుతున్న ఎండల్లో ప్రచారం అంటే కష్టమే. అందుకే ప్రచారానికి  వచ్చే వారికి ఇచ్చే డబ్బులు కూడా  మండిపోతున్నాయని నేతలు వాపోతున్నారు.ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు, సభలకు సంబంధించి కూలీలను తెచ్చుకుని వెంటతిప్పుకొంటూ హడావుడి చేయడం ఎన్నికల్లో ఆనవాయితీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇందుకోసం ఒక్కొక్కరికీ రూ.300- 500 వరకు చెల్లించారు. ఈ విడత అంత మొత్తానికి వచ్చేది లేదంటూ కూలీలు తేల్చి చెబుతున్నారు. కనీసం రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎండల్లో తిరగాలి కాబట్టి అడిగినంతా ఇవ్వాల్సివస్తుండడంతో ఆయా పార్టీల నాయకగణం లెక్కల్లో తేడా వస్తుందని మదనపడి పోతున్నారు.

న్యూస్‌టుడే, షాద్‌నగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని