logo

నాగన్‌పల్లి పాఠశాలలో శతశాతం ఉత్తీర్ణత

ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలోని రామోజీ ఫౌండేషన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉతీర్ణులయ్యారు. 2018 వరకు ఈ గ్రామంలో శిథిలమైన ఇరుకైన 4గదుల్లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల సాగేది.

Updated : 01 May 2024 06:26 IST

రామోజీ ఫౌండేషన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలోని రామోజీ ఫౌండేషన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉతీర్ణులయ్యారు. 2018 వరకు ఈ గ్రామంలో శిథిలమైన ఇరుకైన 4గదుల్లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల సాగేది. ‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేపట్టారు.విశాలమైన స్థలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మించారు. 2019లో ప్రభుత్వం పదోతరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు రామోజీ ఫౌండేషన్‌ ద్వారా నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించడంతో చాలామంది  ఇక్కడ చేరుతున్నారు. 2021లో వందశాతం, 2022లో 97శాతం, 2023లో 97శాతం, 2023-24లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రత్యేక శ్రద్ధతో: 2023-24లో 39మంది పది పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. వైష్ణవి, మనీషా 9.5 జీపీఏ, మరో ఇద్దరు 9.2 జీపీఏ, మిగిలినవారు మంచి మార్కులు పొందారు. నాగన్‌పల్లి, పోల్కంపల్లి, ఎన్గల్‌గూడ, మన్నెగూడ తదితర గ్రామాల పేద విద్యార్థులు చదువుతున్నారు. హెచ్‌ఎం అలివేలు,ఉపాధ్యాయులు రెండుపూటలా ఒక్కో గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటారు. వీరికి రామోజీ ఫౌండేషన్‌ అల్పాహారం అందించింది.


రామోజీ ఫౌండేషన్‌ సహకారం బాగు..

- అలివేలు, హెచ్‌ఎం, నాగన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల

నాగన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వంత శాతం ఉత్తీర్ణత సాధించడం వెనుక నాతో పాటు మిగతా ఉపాధ్యాయులు కృషి ఉంది. విద్యార్థులకు ఏ లోటు లేకుండా రామోజీ ఫౌండేషన్‌ అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, ఎంఈఓ వెంకట్‌రెడ్డి సూచనలు, సలహాలతో వందశాతం ఉత్తీర్ణత సాధించాం.


ఉత్తమ బోధన ఉపయోగపడింది

- వైష్ణవి, విద్యార్థి, 9.5 జీపీఏ

నాగన్‌పల్లి పాఠశాలలో విద్యా బోధన చాలా బాగుంది. వారు అర్థమయ్యేలా చెప్పడంతోనే నాకు 9.5 జీపీఏ వచ్చింది. పాఠశాలలో రామోజీ ఫౌండేషన్‌ అన్ని వసతులు కల్పించింది.


ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ..

-మనీషా, విద్యార్థి 9.5 జీపీఏ

ప్రతి విద్యార్థిపై  ఉపాధ్యాయులు..  శ్రద్ధ పెట్టారు.  ఉదయం, సాయంత్రం వేళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం మాకు ఎంతో మేలు చేసింది.


త్రివేణి విద్యార్థుల ఉత్తమ ఫలితాలు

భాగ్యనగర్‌కాలనీ: త్రివేణి టాలెంట్‌ స్కూల్స్‌ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ చాటారని ఆ విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ గొల్లపూడి వీరేంద్రచౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. త్రివేణి అన్ని బ్రాంచ్‌లలో కలిపి 71 మంది 10/10, 149 మంది 9.8, 227 మంది 9.7 పాయింట్లు సాధించగా మరో 538 మంది 9 పాయింట్లు పొందారని వివరించారు. గణితం, సైన్స్‌లో 4,339 మంది ఏ గ్రేడ్లు సొంతం చేసుకున్నారని ప్రకటించారు. ఎక్కువ బ్రాంచ్‌లలో వందశాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు.


బతుకుదెరువుకొచ్చి..

10 జీపీఏ సాధించిన ప్రతీక్ష

సుల్తాన్‌బజార్‌: సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతీక్ష పది ఫలితాల్లో 10.10 జీపీఏ సాధించింది. ఇసామియాబజార్‌కి చెందిన విద్యార్థిని స్వస్థలం కర్నాటకలోని బాల్కి. తండ్రి జ్ఞానేశ్వర్‌ ఆటోడ్రైవర్‌. అనారోగ్యంతో చిన్నతనంలోనే మరణించారు. సొంతూరిని వదిలి ప్రతీక్షతో పాటు తల్లి సవిత, కుమారుడు పవన్‌ బతుకుదెరువుకు నగరానికి వచ్చి ఇసామియాబజార్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. తల్లి   ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే పిల్లల్ని చదివిస్తోంది. ప్రతీక్ష ఉన్నత చదువులు చదివి పోలీసు ఆఫీసర్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే మంచి మార్కులు సాధించానని పేర్కొంది.


యూపీ నుంచి వచ్చి... పదిలో మెరిసి

ముషీరాబాద్‌: బాగ్‌లింగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్‌ స్కూల్‌ విద్యార్థిని సయ్యద ఇన్షా ఫాతిమా 10 జీపీఏ సాధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం నగరానికి వలస వచ్చారు.  కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమార్తె ఫాతిమాను ఉన్నతంగా చదివించాలనే లక్ష్యంతో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పించారు. ఎస్సెస్సీ ఫలితాల్లో అత్యున్నత ప్రతిభ చాటి ఈ దఫా స్కూల్‌ టాపర్‌గా నిలిచింది.  


తండ్రి హత్యకు గురైనా..

కె.రాంచరణ్‌రెడ్డి

కీసర: కీసర  ప్రభుత్వ పాఠశాలలో చదివిన కె.రాంచరణ్‌రెడ్డి 10/10 సాధించాడు. ఇతని సొంతూరు మహబూబాబాద్‌ జిల్లా కేససముద్రం మండలం నారాయణపురం.  తండ్రి సంపత్‌రెడ్డిని గత ఏడాది గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. తల్లి రవళి, చెల్లెలు  సొంతూరులోనే ఉంటారు. రాంచరణ్‌రెడ్డి  గోధుమకుంటలోని కోళ్ల పరిశ్రమలో పని చేసే తాత, అమ్మమ్మ వద్ద ఉంటూ కీసరలో చదివాడు.


పెయింటర్‌ కూతురు.. చదువులో భేష్‌

తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాస్‌ శైలజతో జ్యోత్స్న

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: మాసబ్‌ట్యాంక్‌ నెహ్రూనగర్‌ ప్రాంతానికి చెందిన జ్యోత్స్న తండ్రి జెట్టి శ్రీనివాస్‌ పెయింటర్‌, తల్లి శైలజ అంగన్‌వాడీ టీచర్‌. తల్లిదండ్రుల కష్టాలు చూసిన జ్యోత్స్న కష్టపడి చదివి ఉన్నతస్థానాల్లో నిలవాలనుకుంది. మాసబ్‌ట్యాంక్‌లోని రెడ్‌క్రాస్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచి 10 జీపీఏ సాధించింది. ఉపాధ్యాయలు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ రోజుకి 4 గంటలు చదువుకి కేటాయించేది. జ్యోత్స్నకు ఒక్కసారి చెబితే గుర్తుండి పోతుందని ప్రధానోపాధ్యాయురాలు ఎంవీ సుమిత్ర చెప్పారు. సివిల్స్‌ సాధించడమే లక్ష్యమని జ్యోత్స్న తెలిపింది.


పేదింట్లో పదింతల ఆనందం

నిజాంపేట: పదో తరగతి ఫలితాలు ఆ పేద కుటుంబంలో అంతులేని ఆనందాన్ని నింపాయి. బాచుపల్లి సాయినగర్‌కు చెందిన స్వామి, మమత దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు  అక్షర ప్రగతినగర్‌లోని జిల్లా పరిషత్తు పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించింది. చిన్నప్పటి నుంచి అక్షరకు చదువుపై మక్కువ ఎక్కువ. తండ్రి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూనే మిగతా సమయాల్లో ఆటో నడుపుతూ బతుకు బండిని నడుపుతున్నాడు. తల్లి ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.


కృషికి పట్టుదల తోడైతే విజయమే

తల్లిదండ్రులతో వరుణ్‌

కొందుర్గు: కృషికి పట్టుదల తోడైతే విజయం మనదేనంటున్నాడు వరుణ్‌. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పరిధిలోని కక్కులూరుకు చెందిన మంగలి శ్రీనివాస్‌, లక్ష్మమ్మ దంపతులకు అర ఎకరం భూమి ఉంది. శ్రీనివాస్‌ ప్రైవేటుగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమారుడు లోకేశ్వర్‌ షాద్‌నగర్‌లో ఇంటర్‌ చదువుతుండగా రెండో కుమారుడు వరుణ్‌ కొందుర్గులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఈసారి పదోతరగతి పూర్తి చేశాడు.  10 జీపీఏ సాధించి పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాడు. ఉపాధ్యాయుల సూచనలు పాటించడంతోనే 10 జీపీఏ సాధించగలిగానని వరుణ్‌ చెప్పాడు.


సత్తా చాటిన మైనార్టీ పాఠశాల బాలికలు

 చరితశ్రీ                                     ప్రణవి

మౌలాలి, న్యూస్‌టుడే: మౌలాలిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల (సనత్‌నగర్‌) పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. పాఠశాలకు చెందిన చరితశ్రీ, ప్రణవిలు పదికి పది జీపీఏ సాధించారు. పాఠశాలలోని 54 మంది విద్యార్థినులు ఉండగా.. నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్‌ మాధవి తెలిపారు. పదికి పది జీపీఏ సాధించిన ఇద్దరిని ఆమె అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని