logo

డిటోనేటర్‌ పరిశ్రమలో భారీ పేలుడు: ఒకరి మృతి

డిటోనేటర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగినా, పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుందని..మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడింది.

Published : 01 May 2024 04:28 IST

పేలుడుతో నేలమట్టమైన ప్లాంటు

కీసర, న్యూస్‌టుడే: డిటోనేటర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి జరిగినా, పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుందని..మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోలీసులకు తెలియకుండా జాగ్రత్తపడింది. ఆలస్యంగా సమాచారం అందుకున్న కీసర పోలీసులు మంగళవారం వెళ్లి వివరాలు సేకరించారు. కీసర సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం.. కీసర మండలం అంకిరెడ్డిపల్లిలోని సాల్వో ఎక్స్‌ప్లోజివ్స్‌ పరిశ్రమలో బిహార్‌ రాష్ట్రం అన్సాన్‌పురకు చెందిన సోనూకుమార్‌(23) ఏడాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి పరిశ్రమలోని ప్లాంటులో డిటోనేటర్‌ తయారీలో భాగంగా మిషన్‌ ఆపరేట్‌ చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. మంటలంటుకొని అతను సజీవ దహనమయ్యాడు. కార్మికుడి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. భారీ పేలుడుతో ప్లాంటు నేలమట్టమైంది. పేలుడు సమయంలో ప్లాంటులో ఒక్కడే ఉన్నాడని, పక్కన ఎవరూ లేరని సీఐ తెలిపారు.

మీడియాను అనుమతించని యాజమాన్యం.. ప్రమాద విషయం తెలిసి పరిశ్రమ వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లగా యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. లోపల పేలుడు పదార్థాలున్నాయని మీరు కెమెరాలు, సెల్‌ఫోన్లతో వస్తే మళ్లీ పేలుళ్లు జరిగే అవకాశం ఉందని సెక్యూరిటీ లోపలికి రాకుండా అడ్డుకున్నారు. కీసర మండల తహాసీల్దారు అశోక్‌కుమార్‌తో పాటు పోలీసుల సెల్‌ఫోన్లను సైతం లోపలికి అనుమతించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని