logo

సుడిగాలిలా చుట్టి రావలె

లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది.  మొన్నటి వరకు  పూర్తిస్థాయిలో ప్రచారం చేయని అభ్యర్థులు ఇప్పుడు గడువు దగ్గరపడుతుండడంతో రాత్రిపగలూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

Updated : 01 May 2024 05:10 IST

గడువు దగ్గర పడటంతో ప్రచార వేగం పెంచిన అభ్యర్థులు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది.  మొన్నటి వరకు  పూర్తిస్థాయిలో ప్రచారం చేయని అభ్యర్థులు ఇప్పుడు గడువు దగ్గరపడుతుండడంతో రాత్రిపగలూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వచ్చే వారం రోజులు కీలకంగా మారడంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఒకవైపు గ్రామాలు మరోవైపు పట్టణాల్లో అభ్యర్థులు ఉరుకులుపరుగులు పెడుతున్నారు.


జోరందుకున్న కాంగ్రెస్‌ ప్రచారం..

సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ మొదట్లో నిదానంగా ఉన్నా.. నామినేషన్ల ప్రక్రియ నుంచి పెద్దఎత్తున ప్రచారాన్ని చేపట్టారు. మధ్యాహ్నం వరకు బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేస్తున్నారు.  చేవెళ్ల  అభ్యర్థి రంజిత్‌రెడ్డి,  మల్కాజిగిరి అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి  ప్రచార వేగాన్ని పెంచారు. ఈ మూడు ఎంపీ స్థానాల పరిధిలో ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మరో ఆరేడు సభలో ఆయన పాల్గొననున్నారు.


భారాస.. బాధ్యత కేటీఆర్‌దే!

భారాస సైతం రాజధాని పరిధిలోని మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో ప్రచార వేగాన్ని పెంచింది. ఇప్పటికే చేవెళ్లలో  జరిగిన సభలో మాజీ సీఎం కేసీఆర్‌ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. ఇప్పుడు మొత్తం ప్రచార పర్యవేక్షణ బాధ్యతను మాజీ మంత్రి కేటీఆర్‌ తీసుకున్నారు. వారంలో నాలుగు రోజులు కాలనీల్లో అభ్యర్థులతో కలిసి తిరుగుతున్నారు. 17 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో వారితో పెద్దఎత్తున ప్రచారం జరిగేలా కేటీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.


పోటాపోటీగా  కమలం..

భాజపా అభ్యర్థులు  కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాధవీలత  వారి పరిధిలో ప్రచారంలో దూకుడు పెంచారు. ఆయా కాలనీలు, గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. షెడ్యూల్‌కంటే ముందే ప్రధాని మోదీ మల్కాగిజిరి పరిధిలో రోడ్డుషో నిర్వహించారు. సోమవారం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేవెళ్ల, మల్కాగిజిరి లోక్‌సభ పరిధిలో రోడ్డుషోలో పాల్గొన్నారు.  బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పరిధిలో రోడ్డు షో నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని