logo

కన్నడిగులపై కన్ను

నగరంలోని కన్నడిగులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది. అక్కడి నేతలను రంగంలోకి దించడానికి కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ ప్రచారం చేయాలని కర్ణాటక నేతలను టీపీసీసీ నాయకులు కోరుతున్నారు.

Published : 01 May 2024 04:25 IST

అక్కడి నేతలతో ప్రచారానికి కార్యాచరణ
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలోని కన్నడిగులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది. అక్కడి నేతలను రంగంలోకి దించడానికి కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ ప్రచారం చేయాలని కర్ణాటక నేతలను టీపీసీసీ నాయకులు కోరుతున్నారు. నవంబరులో జరిగిన ఎన్నికల సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సహా మంత్రులు బోసురాజు, సుధాకర్‌, ప్రియాంక్‌ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్‌ అహ్మద్‌లు గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రచారం చేశారు. ఆ రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ ముగియడం, మళ్లీ మే7న పోలింగ్‌ ఉండడంతో పది రోజుల వ్యవధిలో రెండు, మూడు రోజులు వారితో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. సిద్ధరామయ్య, ముగ్గురు మంత్రులు హైదరాబాద్‌కు వచ్చేందుకు అంగీకరించారు. చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజవర్గాల్లో వీరు పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు.

సమావేశాలతో ఆకర్షణ మంత్రం..

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు ఇక్కడికి వచ్చేముందు ప్రత్యేక ప్రణాళికలతో వస్తున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజవర్గాల్లో నివసిస్తున్న కన్నడిగుల వివరాలు తెలుసుకుని వారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌, కాచిగూడ, ఖైరతాబాద్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, ఎల్బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలోని కన్నడ సంఘాల ప్రతినిధులతో మాట్లాడనున్నారు. కాచిగూడ, మలక్‌పేటలో ఉంటున్న కన్నడ సంఘాలతో ఇప్పటికే ఇద్దరు మంత్రులు చర్చించారు.

స్థానిక అంశాలు.. గ్యారెంటీలు

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వస్తున్న నేతలను స్థానిక అంశాలు, ఆరు గ్యారెంటీలను సభల్లో ప్రస్తావించాల్సిందిగా రాష్ట్ర నాయకులు సూచించారు. కర్ణాటకలో అమలు చేస్తున్న గ్యారెంటీలతో ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులను ఇక్కడి వారికి వివరించాల్సిందిగా కోరారు. మహిళలు, యువతులు, ఐటీ ఉద్యోగినులకు ఉచిత బస్సు ప్రయాణంతో జరుగుతున్న మేలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుతో పొందుతున్న లబ్ధిపై ప్రచారం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని