logo

తొలిఘట్టం మొదలైంది..

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్‌ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు గురువారం సమర్పించారు.

Updated : 19 Apr 2024 04:38 IST

ఆర్వోకు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న  మధు  

ఈనాడు, హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్‌ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు గురువారం సమర్పించారు. రాజధాని పరిధిలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక్కరు కూడా నామినేషన్‌ పత్రాలు సమర్పించలేదు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఇద్దరు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ కె.శశాంకకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. 

వెంకట్‌రమేష్‌  

పార్టీలు వేరే.. ప్రధాన ప్రత్యర్థులు వారే

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు గతంలోనూ ప్రత్యర్థులుగా బరిలో ఉన్న వారే కావడం విశేషం. అయితే గత ఎన్నికలలో ఇద్దరు వేరే పార్టీల నుంచి పోటీ చేయగా ప్రస్తుతం పార్టీలు మారి మళ్లీ బరిలో నిలిచారు.  ఇందులో భాజపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒకరు కాగా మరొకరు ప్రస్తుత ఎంపీ, కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. గత లోక్‌సభ ఎన్నికలలో రంజిత్‌రెడ్డి భారాస నుంచి పోటీలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారి కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు. గతం, ప్రస్తుతం రెండు సందర్భాల్లోనూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచే రంజిత్‌రెడ్డి బరిలో ఉండడం గమనార్హం. ఇక గత ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈసారి ఎన్నికలలో భాజపా నుంచి పోటీలో ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారాస నుంచి బీసీ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ పోటీపడుతున్నారు.

మహ్మద్‌రిజ్వాన్‌


తహసీల్‌ కార్యాలయంలో ప్రకటన సమాచారం

పత్రాన్ని చూపుతున్న తహసీల్దార్‌, విజయ్‌కుమార్‌

కొడంగల్‌,న్యూస్‌టుడే:పార్లమెంట్‌ ఎన్నికల సమాచారం ప్రజలకు, నేతలకు చేరువ చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. కొడంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ సమాచారం నోటిస్‌ బోర్డులో అతికించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ బి.విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ నామినేషన్‌ వేసే అభ్యర్థులు దరఖాస్తును మహబూబ్‌నగర్‌లో తీసుకొని అక్కడే నామినేషన్‌ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.


డీకే అరుణ, మహ్మద్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ నామినేషన్‌ దాఖలు

ఈనాడు, మహబూబ్‌నగర్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి భాజపా నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రెండు సెట్ల నామపత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఆమె ఉదయం మహబూబ్‌నగర్‌ పట్టణం పిల్లలమర్రి రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహబూబ్‌నగర్‌ - భూత్పూర్‌ మార్గంలో కార్యకర్తల భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయానికి చేరుకున్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత నాగురావు నామాజీతో కలిసి రిటర్నింగ్‌ అధికారి రవినాయక్‌కు నామపత్రాలు అందించారు. ఈ లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా మహ్మద్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ నామపత్రాలు దాఖలు చేశారు.  

నేడు వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి రాక..: నామినేషన్లకు ఈ నెల 18వ, 19వ, 25వ తేదీల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి. గురువారం నామపత్రాలు దాఖలు చేయని ప్రధాన పార్టీ అభ్యర్థులు శుక్రవారం సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా తరలివెళ్లి నామపత్రాలు దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామపత్రాల దాఖలు అనంతరం గడియారం చౌరస్తాలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పోలీసులు మహబూబ్‌నగర్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భారాస మహబూబ్‌నగర్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌లు కూడా శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

డీకే అరుణ ఆస్తుల వివరాలు

చరాస్తుల విలువ : రూ.3,21,73,518
స్థిరాస్తుల విలువ : రూ.3,10,00,000
బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు : లేవు
ప్రస్తుతం దగ్గర ఉన్న నగదు : రూ.1,50,000
డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి ఆస్తులు..
చరాస్తుల విలువ : రూ.23,26,16,353
స్థిరాస్తులు విలువ : రూ.37,17,80,000
బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు : రూ.1,38,79,619
ప్రస్తుతం దగ్గర ఉన్న నగదు : 20,00,000

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని