logo

తొలిఘట్టం మొదలు

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్‌ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు గురువారం సమర్పించారు.

Published : 19 Apr 2024 03:16 IST

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
చేవెళ్లలో ముగ్గురు, మల్కాజిగిరి నుంచి 8 మంది దాఖలు

కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరిన ఈటల

ఈనాడు, హైదరాబాద్‌, మేడ్చల్‌ కలెక్టరేట్‌,రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్‌ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు గురువారం సమర్పించారు. రాజధాని పరిధిలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక్కరు కూడా నామినేషన్‌ పత్రాలు సమర్పించలేదు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా పాలమాకుల మధు,  సోషలిస్ట్‌ పార్టీ ఇండియా అభ్యర్థిగా బి.వెంకట్‌రమేష్‌బాబు, స్వతంత్య్ర అభ్యర్థిగా మహమ్మద్‌ ముస్తఫా రిజ్వాన్‌ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ కె.శశాంకకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థులుగా ఈటల రాజేందర్‌, ఈటల జమున, మరో రాజకీయ పార్టీ అభ్యర్థితో పాటు ఐదుగురు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు.

నేడు కిషన్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ..

అంబర్‌పేట, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి, హైదరాబాద్‌ మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీలు శుక్రవారం తమ నామినేషన్లు వేయనున్నారు. కిషన్‌రెడ్డి మధ్యాహ్నం 12గంటలోపు, అసదుద్దీన్‌ శుక్రవారం ప్రార్థనల అనంతరం నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో జరిగే కిషన్‌రెడ్డి కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరవుతున్నారని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సి.వినోద్‌యాదవ్‌ తెలిపారు.

కంటోన్మెంట్‌ నిల్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: కంటోన్మెంట్‌ నియోజక ఉప ఎన్నికకు సంబంధించి తొలి రోజైన గురువారం ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో మధుకర్‌నాయక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం నుంచి నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. నామినేషన్లను దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులు వంద మీటర్ల అవతలే తమ ర్యాలీని నిలిపివేయాలని, అభ్యర్థితోపాటు మరో నలుగురికి మాత్రమే లోనికి ప్రవేశించే అవకాశం ఉంటుందని, నిబంధనలు పాటించి అభ్యర్థులు సహకరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని