logo

ఉద్యానం.. అధ్వానం

కోరుట్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యానవనం నిర్మాణ దశలోనే ఆధ్వానంగా తయారైంది. పట్టణంలో సుమారు లక్ష వరకు జనాభా ఉంటుంది. ప్రజలు సేదతీరేందుకు పట్టణంలో

Published : 23 Jan 2022 02:25 IST

వాగులో 3.20 ఎకరాల స్థలం కేటాయింపు

కోరుట్ల, న్యూస్‌టుడే

వరద నీటికి కూలిన కట్టడం

కోరుట్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యానవనం నిర్మాణ దశలోనే ఆధ్వానంగా తయారైంది. పట్టణంలో సుమారు లక్ష వరకు జనాభా ఉంటుంది. ప్రజలు సేదతీరేందుకు పట్టణంలో కావాల్సిన పార్క్‌లు, క్రీడా మైదానాలు, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేకుండా ఉన్నాయి. సాయిరాంకాలనీలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న పిల్లల పార్క్‌ ఆధునికీకరణ పేరిట ఏళ్ల తరబడి జాప్యం చేస్తుండటంతో అది వినియోగంలో లేకుండా పోయింది. పట్టణవాసుల కోసం నూతన ఉద్యానవనం నిర్మించాలని పుర పాలకులు యోచించారు. ఇందుకోసం జగ్జీవన్‌రామ్‌ విగ్రహం దగ్గర్లోనున్న పెద్దవాగు మధ్యలోని 3.20 ఎకరాల స్థలాన్ని రెవెన్యూశాఖ కేటాయించింది. ఇందులో పార్క్‌ నిర్మాణం కోసం మున్సిపల్‌ టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.40 లక్షలను కేటాయించారు. 2021 ఫిబ్రవరిలో భూమిపూజ చేసి ఉద్యానవన నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు చేపట్టి ఏడాది కావస్తున్నా మధ్యలోనే వదిలేశారు.

పనులు చేపట్టకుండా వదిలేసిన దృశ్యం

వరదకు కొట్టుకుపోయిన నిర్మాణం

ఉద్యానవనం కోసం వాగులో కేటాయించిన 3.20 ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. పిల్లర్లను నిర్మించి వాటిపై గోడను నిర్మిస్తున్నారు. ఇంతలో ఇటీవల వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులో పెద్దఎత్తున వరదనీరు వారాల తరబడి ప్రవహించింది. వరదనీటి ఉద్ధృతి ఉద్యానవన కట్టడాలను తాకడంతో పిల్లర్లు, గోడ కింది నుంచి ఓవైపు కూలిపోయింది. నిర్మాణ దశలోనే కట్టడాలు దెబ్బతింటుండగా రానున్న రోజుల్లో ఇది ఎంత సురక్షితంగా ఉంటుందో అర్థమౌతోంది. ఉద్యానవన గోడలకు వరదనీరు రాకుండా ఉండేందుకు వాగులో పాతకట్టడాల నుంచి తొలగించిన రాళ్లు, సిమెంట్‌, మట్టి పెల్లలను పోస్తున్నారు. దీంతో వాగు విస్తీర్ణం పూర్తిగా కుచించుకుపోతోంది.

ఆక్రమణలో వాగు స్థలం

పట్టణంలోనున్న ఏకైక పెద్దవాగు చాలా విస్తీర్ణంతో వ్యాపించి ప్రవహిస్తుండేది. కొన్నేళ్లుగా పైప్రాంతంలో వాగుకు అడ్డంగా డ్యాంలను నిర్మించడంతో వాగులో నీటి ప్రవాహం, వరద తగ్గిపోయింది. దీంతో వాగు ఒడ్డుకు, వాగు స్థలంను ఆక్రమించుకుని ఆక్రమంగా వందల సంఖ్యలో ఇళ్లను, కట్టడాలను చేపట్టారు. వాగు స్థలంలో నిర్మాణాలు నిషేధం అని తెలిసినా వాటిని అడ్డుకోవడంలో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వాగును ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లకు మున్సిపల్‌ అధికారులు ఇంటి నెంబర్లు వేసి కాలనీలో సీసీరోడ్డు, మురుగు కాలువలను నిర్మించి, తాగునీటి సౌకర్యం, విద్యుత్తు సౌకర్యం కల్పించారు. దీంతో అందరిముందే వాగు స్థలంను యథేచ్ఛగా ఆక్రమించుకుని ఇళ్లను నిర్మిస్తున్నారు. వాగు స్థలం ఖాళీగా ఉంటే ఆక్రమణకు గురవుతుందనే కారణంతో ఉద్యానవనం నిర్మిస్తే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని రెవెన్యూశాఖ భావించింది. వాగు స్థలం ఉద్యానవనం నిర్మాణానికి అనువైనది కాకపోయినా లక్షలు వెచ్చించి నిర్మాణం చేపట్టడం పాలకుల పనితీరులకు అద్దం పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని