logo

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం!

దెబ్బతిన్న పంట పొలాల్లో కలియదిరుగుతూ.. జరిగిన నష్టాన్ని కళ్లారా చూస్తూ.. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని.. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసానిచ్చారు.

Published : 24 Mar 2023 04:19 IST

రైతులకు భరోసానిచ్చిన సీఎం కేసీఆర్‌
ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే- రామడుగు

పంట నష్టాన్ని సీఎంకు వివరిస్తున్న రైతు రాంచంద్రారెడ్డి, చిత్రంలో మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే రవిశంకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

దెబ్బతిన్న పంట పొలాల్లో కలియదిరుగుతూ.. జరిగిన నష్టాన్ని కళ్లారా చూస్తూ.. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని.. రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసానిచ్చారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌, రాంచంద్రాపూర్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. డ్రాగన్‌ ఫ్రూట్‌, తర్బూజా పంటలను సాగు చేసిన రైతు రాంచంద్రారెడ్డి పంట పొలానికి చేరుకున్న సీఎం బాధిత రైతుతో మాట్లాడారు. రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన పంట పూర్తిగా ఎందుకు పనికిరాకుండా పోయిందని ఆయన వివరించారు. పెద్దపెద్ద రాళ్ల వాన పడటంతోనే ఇంతటి నష్టం జరిగిందని.. తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం ధైర్యం చెప్పారు. ఈ సమయంలోనే బండారి శంకరయ్య అనే కౌలు రైతు తనకు జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి ఎదుట ఏకరవు పెట్టుకోగా, ఈ సారి పంటనష్టం సాయాన్ని కౌలు రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ రైతు వివరాల్ని నమోదు చేసుకోవాలని పక్కనే ఉన్న కలెక్టరు ఆర్వీ కర్ణన్‌ను ఆదేశించారు. సుమారు 15 నిమిషాల పాటు పక్కపక్కనే ఉన్న పొలాలను పరిశీలించారు. అక్కడి రైతులు సుమారుగా 14 మంది సీఎంకు తమ వేదనని విన్నవించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలుగకుండా చూస్తానని.. త్వరలోనే రైతుల వారీగా పరిహారాన్ని ఎకరానికి రూ.10వేల చొప్పున బాధితులైన అన్నదాతలకు అందిస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతు వివరాల్ని పక్కాగా సేకరించాలని, ఏ ఒక్క బాధితుడికి ఇబ్బంది ఎదురవకుండా చూడాలని మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు.

గంటపాటు పర్యటన...

సాయంత్రం 4 గంటలకు సీఎం హెలికాప్టర్‌లో గాయత్రి పంప్‌హౌజ్‌ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, శాసనమండలి విప్‌ కౌశిక్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌గౌడ్‌, సుడా ఛైర్మన్‌ జీవీ రామకృష్ణారావులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టరు ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, పోలీసు కమిషనర్‌ సుబ్బారాయుడులు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో సీఎం పంట పొలాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఈసందర్భంగా గాయత్రి పంప్‌హౌజ్‌ నుంచి కాలువలో పారుతున్న నీటిని చూస్తూ సీఎం ముందుకు సాగారు. దాదాపు 3 కి.మీ.ల దూరంలో ఉన్న లక్ష్మీపూర్‌, రాంచంద్రాపూర్‌ పొలిమేరలో ఉన్న పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ఈ సమయంలోనే స్వామిరెడ్డి అనే రైతు సీఎం కాళ్లను మొక్కేందుకు ప్రయత్నించగా సీఎం వద్దని వారిస్తూ ముందుకు కదిలారు. అన్నదాతల ఆవేదనను తెలుసుకున్న అనంతరం రామడుగు క్లస్టర్‌ రైతువేదిక వద్దకు చేరుకుని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముందుగా రైతులతో మాట్లాడుతానని సీఎం అన్నారు. అప్పటికప్పుడు ఎమ్మెల్యే రైతులను మైక్‌లో పిలుస్తుండటంతో సీఎం వద్దని చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరుగుపయనమయ్యారు. సుమారు గంటపాటు పర్యటన కొనసాగింది. సీఎం విలేకరుల సమావేశం నిర్వహించిన రైతు వేదిక లోపలికి అనుమతించలేదని స్థానిక ఎంపీపీ కవిత, చిప్పకుర్తి సర్పంచి రాజేశ్వర్‌ నిరసన తెలిపారు.

మామిడి కాయను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి నిరంజన్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని