logo

నేటి నుంచి శివ కల్యాణోత్సవం

ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు శివ కల్యాణోత్సవం జరుగనుంది

Published : 27 Mar 2024 03:12 IST

 విద్యుద్దీపకాంతుల్లో రాజన్న ఆలయం
న్యూస్‌టుడే, వేములవాడ: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు శివ కల్యాణోత్సవం జరుగనుంది. దీంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాంగణంలో యాగశాలను సిద్ధం చేశారు. అయిదు రోజుల పాటు నిర్వహించే శివ కల్యాణోత్సవ వేడుకలకు ఆలయంలో పలు, మామిడి, అరటి తోరణాలతో అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో పెద్దఎత్తున చలువ పందిళ్లు, తెల్లటి పెండాళ్లు ఏర్పాటు చేశారు. 28న ఉదయం 10.50 నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరి స్వామివార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణలతో వైభవంగా నిర్వహించనున్నారు. 27న ఉదయం 8.05 గంటలకు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పుణ్యాహవాచనం, సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, శివ మహాపురాణ ప్రవచనం నిర్వహించనున్నారు. రాత్రి భేరీ పూజ దేవతాహ్వాన, మంగళహారతి, మంత్ర ఫుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడతారు. 29న తీర్థరాజస్వామిపూజ ఆవాహిత దేవాతార్చన, బలిహరణం, ఔపాసనం, కల్యాణ మండపంలో రాత్రి సదస్యం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి. 30న సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 31న పూర్ణాహుతి, క్షేత్రపాలక బలి, ధర్మగుండంలో త్రిశూలయాత్ర, రాత్రి ఏకాదశ ఆవరణములు, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

40 వేల మంది వస్తారని అంచనా..

 రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు, శివపార్వతులు వేడుకలకు రానున్నారు. దాదాపు 40 వేలకు పైగా మంది వస్తారని ఆలయ అధికారుల అంచనా వేస్తున్నారు. గతంలో ఆలయంలోని కల్యాణ మండపంలో కల్యాణ వేడుకలను నిర్వహించేవారు. వేడుకలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో స్థల సమస్యతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆలయ అధికారులు ఈసారి కల్యాణ వేదికను ఈవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. భక్తులకు ముఖ్యంగా తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రధాన ప్రాంతాల్లో 8 భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ప్రాంతంలో ప్రత్యేక బారికేడ్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని