logo

హనుమాన్‌ జయంతికి ప్రత్యేక ఏర్పాట్లు

వచ్చే నెల 23న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Published : 27 Mar 2024 03:44 IST

న్యూస్‌టుడే, మల్యాల: వచ్చే నెల 23న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి దాదాపు మూడు లక్షలకుపైగా దీక్షాపరులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అంజన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కొండగట్టు ఇన్‌ఛార్జి ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలను వెల్లడించారు.

 ప్రశ్న:  చిన్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఎప్పుడు ప్రారంభిస్తారు? ఆయా శాఖల అధికారులతో ఎలా సమన్వయం చేస్తున్నారు?

 సమాధానం: హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాల నిర్వహణలో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎండలు అధికంగా ఉండటంతో తడకల పందిళ్లు, నీటి వసతి, బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్నాం ఉత్సవాల సమయంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి అర్చకులతో చర్చించి వారు నిర్ణయించిన తేదీలోగా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తాం. జిల్లా కలెక్టరు అనుమతితో త్వరలోనే తేదీ ప్రకటిస్తాం.్చ
ప్ర: ఇటీవల కొండగట్టులో నిధుల దుర్వినియోగం కారణంగా పలువురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించేలా చేపట్టనున్న చర్యలు?
స: ఆలయంలో ప్రతీ ఉద్యోగి పనితీరుపై నిఘావేయడంతోపాటు ప్రతినెలా సమీక్షలు నిర్వహించి రికార్డులు పరిశీలిస్తాం. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటాం. సిబ్బంది పనితీరు గాడినపడేలా ప్రత్యేక దృష్టి సారిస్తాం.
ప్ర: ఆలయ పుష్కరిణి శుభ్రంగా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. దీనిని ఎలా అధిగమిస్తారు?
స: ఆలయం ముందున్న పుష్కరిణిలో ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని నింపేందుకు చర్యలు చేపడుతున్నాం. ధర్మగుండం వద్ద పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. దీక్షాపరులు పడేసే దుస్తులను వెంటవెంటనే తొలగించడానికి పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తాం.
ప్ర: ఎండల తీవ్రత అధికంగా ఉంది. భక్తుల సౌకర్యం కోసం చలువ పందిళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది కదా?
స: ఆలయం ముందు భాగంలో కొంతమేర చలువ పందిళ్లను ఏర్పాటు చేశాం. వేడుకల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాల్లో సేదతీరేందుకు చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టేలా సిబ్బందితో సమీక్షిస్తున్నాం.
ప్ర: భక్తులకు శుద్ధజలం అందించేందుకు తీసుకుంటున్న చర్యలు?
స: ఆలయ పరిసరాల్లో మూడు శుద్ధజల కేంద్రాల ద్వారా భక్తులకు నిరంతరంగా రక్షిత తాగునీరు అందుతోంది. ఈసారి మిషన్‌ భగీరథ పథకం ద్వారా పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరిగే అవకాశం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి భక్తులకు తాగునీరు, ధర్మగుండంలోకి నీటి సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందిస్తాం.
ప్ర: పలువురు సిబ్బంది భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.? కొండపై పూజా సామగ్రి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.?
స: అంజన్న ఆలయంలో టెంకాయలు కొట్టే చోట ఎలాంటి రుసుము లేకపోయినా కొందరు సిబ్బంది భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. దీనిపై చర్యలు తీసుకుంటాం. టెంకాయ కొట్టడానికి ఎలాంటి రుసుము ఇవ్వకూడదు. ఈ అంశంపై బోర్డు ఏర్పాటు చేస్తాం. తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి డబ్బులు డిమాండు చేసే క్షురకులను కూడా హెచ్చరించాం. కొండపైన పూజా సామగ్రిని అధిక ధరలకు విక్రయించకుండా నియంత్రిస్తాం. భక్తులు ఆలయానికి అందజేసే ప్రతి కానుకను నేరుగా అర్చకులకు కాకుండా ఆలయ సిబ్బంది స్వీకరించి దాతలకు రశీదులు అందజేసి భద్రపరిచేలా చూస్తాం.
‘న్యూస్‌టుడే’ చంద్రశేఖర్‌ కొండగట్టు ఇన్‌ఛార్జి ఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని