logo

ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు

పార్లమెంట్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు

Published : 28 Mar 2024 05:13 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, చిత్రంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, గౌతమి
సిరిసిల్ల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్‌ ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణ కారణంగా పోలింగ్‌ రోజు ఓటు వేసే అవకాశం లేని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు తప్పనిసరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని తెలిపారు. పోలింగ్‌ రోజు ఓటు వేయలేని వారి కోసం ఫారం 12డి అందుబాటులో ఉంచామని, పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహణ కోసం ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమిస్తామన్నారు. రవాణా సేవలు, మీడియా, విద్యుత్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, దూరదర్శన్‌, ఆకాశవాణి, రాష్ట్ర మిల్క్‌ యూనియన్‌, మిల్క్‌ కోఆపరేటివ్‌ సొసైటీలు ఆరోగ్యశాఖ, ఫుడ్‌ కార్పొరేషన్‌, ఆర్టీసీ, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్‌ పోలీస్‌ తదితర 33 అత్యవసర శాఖల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. 85 ఏళ్ల వయసు వారు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకుంటే వారి ఇంటి వద్దకు ఇద్దరు పోలింగ్‌ అధికారులు, వీడియో గ్రాఫర్‌, సెక్యూరిటీ వచ్చి ఓటు వేసే అవకాశం కల్పిస్తారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసే ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లి తమ ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు పి.గౌతమి, ఖీమ్యానాయక్‌, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేశ్‌, రాజేశ్వర్‌, డీఈవో రమేశ్‌కుమార్‌, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి, ఎన్నికల పర్యవేక్షకులు, ఏడీఎం శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని