logo

పంచాయతీల ఖజానా ఖాళీ

ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

Updated : 28 Mar 2024 05:40 IST

నిధుల కొరతతో వెక్కిరిస్తున్న సమస్యలు 

కాలువలో పేరుకుపోయిన మురుగు 

 న్యూస్‌టుడే, సిరిసిల్ల పట్టణం: ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఫిబ్రవరి 2 నుంచి జిల్లాలో 139 మంది ప్రత్యేకాధికారులకు పరిపాలన, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.  చెక్‌ పవర్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారికి కల్పించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన సమానంగా నిధులు కేటాయిస్తుంటాయి.  గత ప్రభుత్వ హయాంలో సుమారు సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. ఎన్నికలకు ముందు కొంత మొత్తం ఖాతాల్లో జమయ్యాయి. ఎఫ్‌ఎఫ్‌సీ (15వ ఆర్థిక సంఘం) నిధులు సైతం సరిపడా రావడం లేదు. సీసీ ఛార్జీలు (కరెంటు బిల్లులు) కచ్చితంగా చెల్లించాలన్న ఆదేశంతో ఆ నిధులకు కోత పడుతుంది. జనరల్‌ ఫండ్‌తోపాటు మిగతా చాలీచాలని నిధులతో పల్లెలను నెట్టుకురావడం పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు పదహారు నెలలుగా పల్లెలకు నిధులు విడుదల కావడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 20 పంచాయతీలు ట్రాక్టర్‌ వాయిదాలు చెల్లించలేకపోవడంతో నోటీసులు అందాయి. చెత్త సేకరణకు ఇంధనం కొనుగోలు, ట్రాక్టర్‌ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీనికి తోడు చాలా చోట్ల రెండు గ్రామ పంచాయతీలకు ఒక్కరే అధికారిని నియమించారు. ఇతర శాఖల అధికారులకు చెందిన వారికి పంచాయతీల నిర్వహణ, విధులపై అంతగా పట్టు లేదు. దీనికి తోడు తమ కార్యాలయాల్లో పని భారంతో పంచాయతీలకు అంతగా సమయం కేటాయించడం లేదు. దీంతో పాలనలో ఆశించిన మేర ఫలితాలు ఉండటం లేదు.

వేతనాలు లేక...

కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు కదలకపోవడంతో వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోతోంది. కాలువల్లో పూడిక తొలగించక దుర్వాసన వస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు హడావుడిగా అక్కడక్కడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వదిలేస్తున్నారు. నాలుగు నెలలుగా పంచాయతీల్లో మల్టీపర్పస్‌ కార్మికులకు సకాలంలో వేతనాలు అందకపోవడమే ఇందుకు కారణం.  సరిపడా మిషన్‌ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటి ఎద్దడి మొదలైంది. అద్దె బోరులతో నీటి సరఫరా చేయాల్సి వస్తోంది. పంచాయతీ బోర్లలో నీటి మట్టం తగ్గడంతో హరితహారం, నర్సరీల్లో మొక్కలు ఎండుతున్నాయి.   పంచాయతీల్లో సమస్యలపై జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్యతో మాట్లాడగా నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా పల్లెల్లో ఇబ్బంది కలుగుతున్నది వాస్తవమేనన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించడంతోపాటు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని, ప్రత్యేకాధికారులు పర్యవేక్షణ చేసేలా చూస్తామని చెప్పారు. జిల్లాలో తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని