logo

పల్లెల్లో గాడి తప్పిన ప్రత్యేక పాలన

జిల్లాలోని గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం రెండు నెలల కిందట పూర్తయింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పాలన కొనసాగుతోంది.

Published : 16 Apr 2024 03:38 IST

కొరవడిన పారిశుద్ధ్య కార్యక్రమాలు

  • రామడుగులో మురుగుకాలువల్లోని పూడికను రోడ్డుపై వేయడం, రోజుల తరబడి తరలించకపోవటంతో ఆ చెత్తను పందులు, కోళ్లు చిందర వందర చేస్తున్నాయి. బాటసారులకు అసౌకర్యం కలుగుతోంది.
  • కరీంనగర్‌ గ్రామీణ మండలం ఇరుకుల్లలో మిషన్‌ భగీరథ పైపు పగిలి 15 రోజులుగా మురుగు నీరు వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించినా సమస్య పరిష్కారానికి నోచలేదు.
  • కొత్తపల్లి మండలం చింతకుంటలోని శాంతినగర్‌లో వీధి దీపాలు వెలగకపోవటంతో కాలనీవాసులు రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్నారు.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం రెండు నెలల కిందట పూర్తయింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పాలన కొనసాగుతోంది. వేర్వేరు శాఖల నుంచి ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారిని కేటాయించారు.  వారిలో కొందరికి గ్రామాలపై అవగాహన లేకపోవడం, ఇతర బాధ్యతలు.. తదితర కారణాలతో పర్యవేక్షణ కొరవడింది. తాగునీటి సరఫరాలో లోపాలు, పారిశుద్ధ్యం కొరవడటం తదితర లోపాలు వెలుగుచూస్తున్నాయి.  చిన్న చిన్న సమస్యలతో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు.

నిధుల లేమితో..

జిల్లాలోని 313 గ్రామపంచాయతీలకు జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి. కానీ ఏడాదిగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు(ఎస్‌ఎఫ్‌సీ) రాక, చాలీచాలని జనరల్‌ నిధులతో నెట్టుకు రావటం ప్రత్యేక అధికారులకు తలకు మించిన భారంగా మారింది. సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రత్యేక అధికారులకు పాలుపోవడంలేదు. ఎన్నికలకు ముందు 15వ ఆర్థిక సంఘం నిధులు కొద్ది మొత్తంలో  మంజూరు చేసినా అవి సరిపోలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందంగా గ్రామాల పరిస్థితి తయారైంది.

సిబ్బందికి అందని జీతాలు

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టే మల్టీపర్పస్‌ వర్కర్ల జీతాలు నిధుల లేమితో కొన్ని పంచాయతీల్లో నెలలుగా అందటం లేదు. వారి కుటుంబాలను నెట్టుకు రావటం కష్టంగా మారి.. విధుల నిర్వహణపై నిరాసక్తతతో ఉన్నారు. బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన పంచాయతీ ట్రాక్టర్‌కు కిస్తీలు కట్టడానికి ప్రత్యేక అధికారులు నానా యాతన పడుతున్నారు. వాయిదాలు సరిగా చెల్లించటంలేదని కొన్ని పంచాయతీలకు బ్యాంకర్లు నోటీసులు సైతం జారీ చేసినట్లు సమాచారం.

ఎద్దడి నివారణకు రూ.6.58 కోట్లు

వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవడానికి జిల్లాకు ప్రత్యేక నిధుల కింద రాష్ట్ర సర్కారు రూ.6.58 కోట్లు కేటాయించటంతో కొంత ఊరట లభించినట్లయింది. ఈ నిధులతో ప్రత్యేక పైపులైన్లు, బోరు బావుల మరమ్మతులు, నూతన బోరుబావుల ఏర్పాటు, వ్యవసాయ బావులను అద్దెకు తీసుకొని నీటి సరఫరా చేయటం వంటి పనులు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని