logo

యాప్‌ కష్టాలు

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్‌ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది.

Published : 24 Apr 2024 05:42 IST

చిన్నారులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న ఉపాధ్యాయిని (పాత చిత్రం)

న్యూస్‌టుడే, జగిత్యాల విద్యానగర్‌ : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్‌ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యలతో పాటు, కేంద్ర యాప్‌నకు సంబంధించి సకాలంలో మార్గదర్శనం అందకపోవడం, అవగాహన లేమి తదితర కారణంగా ప్రక్రియలో జాప్యం నెలకొంటోంది. దీనికి తోడు వార్షిక సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి రాగా, ఏఎన్‌ఎంలు నమోదు చేస్తున్న వివరాలు సరిపోకపోవడం జాప్యానికి కారణంగా నిలుస్తోంది. దీంతో ఉపాధ్యాయినులతో పాటు, సహాయకులు తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురువుతున్నారు.

మొత్తం 1065 కేంద్రాలు..  

జిల్లాలో మొత్తం 1065 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ప్రతి కేంద్రంలో ఉపాధ్యాయిని, సహాయకురాలు సేవలు అందిస్తున్నారు. గతంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రతి నిత్యం అందించే సేవల వివరాలు రిజిస్టర్లలో నమోదు చేసేవారు. ఏడేళ్ల నుంచి సంబంధిత వివరాలు చరవాణుల్లో నమోదు చేయడం తప్పనిసరి చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పోషణ్‌ ట్రాకర్‌, రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌టీఎస్‌(న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం) యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది.

సాంకేతిక సమస్యలు

చరవాణుల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం మరో సమస్యగా మారింది. దీనికి తోడు ప్రతినిత్యం సమాచారం నిక్షిప్తం చేయాల్సి రావడంతో చరవాణుల్లో చాలినంత మెమోరీ లేకపోవడం, వివరాలు నమోదు కాకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు నమోదు ప్రక్రియ ప్రహసనంగా మారింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కేంద్రాల నిర్వాహకులు కోరుతున్నారు.  


ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం

యాప్‌ల వినియోగంలో సమస్యలు తలెత్తుతున్న విషయం వాస్తవమే. అయితే వార్షిక సర్వే వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయాల్సి రావడంతో పాటు, విడిగా సర్వే చేపట్టిన ఏఎన్‌ఎంలు నమోదు చేస్తున్న వివరాల్లో పొరపాట్ల కారణంగా ప్రక్రియ పూర్తి చేయడంలో జాప్యం తప్పడం లేదు. సమస్యలు దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిస్కరిస్తాం

 బి.వాణిశ్రీ, ఇన్‌ఛార్జి డీడబ్ల్యూవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని