logo

రాందాస్‌.. వైరా బాస్‌

హోరా హోరీగా జరిగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థి మాలోత్‌ రాందాస్‌నాయక్‌ విజయ ఢంకా మోగించారు.

Published : 04 Dec 2023 03:59 IST

రాందాస్‌నాయక్‌కు ఎన్నికల ధ్రువ పత్రం అందజేస్తున్న ఆర్‌ఓ సత్యప్రసాద్‌

వైరా, న్యూస్‌టుడే: హోరా హోరీగా జరిగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థి మాలోత్‌ రాందాస్‌నాయక్‌ విజయ ఢంకా మోగించారు. భారాస నుంచి పోటీ చేసిన బాణోత్‌ మదన్‌లాల్‌పై 33,045 భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. 18 రౌండ్ల వారీగా లెక్కింపు చేపట్టారు. అన్ని రౌండ్లలోనూ రాందాస్‌ స్పష్టమైన మెజార్టీ కనబరిచారు. కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు మినహా ఇతర పార్టీలెవరు చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేకపోయారు. పోస్టల్‌ బ్యాలెటులోనూ కాంగ్రెస్‌ భారీ ఆధిక్యం సాధించింది. భారాసపై 1,104 పోస్టల్‌(హోమ్‌ ఓటింగ్‌తో కలిపి) మెజార్టీ వచ్చింది.

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తా

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన మాలోత్‌ రాందాస్‌నాయక్‌ పేర్కొన్నారు. ఫలితాల అనంతరం ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి గిరిజన మండలాల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఆయా మండలాలకు ఐటీడీఏ నుంచి ప్రత్యేక నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. సాగు సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని సీతారామ ప్రాజెక్టు నీటిని వైరా జలాశయానికి తీసుకొస్తానని ప్రతి ఎకరానికి నీరు అందిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వైరా పురపాలకాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అన్నివర్గాల ప్రజల సహకారంతో విద్య,వైద్యరంగాల్లో సమస్యలు లేకుండా మరింత ఉన్నతి కనిపించేలా ఉంటానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రశాంతమైన పాలన అందిస్తామన్నారు గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి పేదవిద్యార్థులకు ఇబ్బందులు రానివ్వకుండా చేస్తామని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని