logo

భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావు

ఖమ్మం లోక్‌సభ భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావును ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. కమలం టికెట్‌ కోసం పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్‌రావు వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది.

Updated : 25 Mar 2024 06:29 IST

ఈటీవీ ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ భాజపా అభ్యర్థిగా తాండ్ర వినోద్‌రావును ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. కమలం టికెట్‌ కోసం పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్‌రావు వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. తాండ్ర స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామం. చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. దశాబ్దకాలంగా సామాజిక సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉన్నత చదువుల అనంతరం అమెరికాలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చి భాజపాలో చేరారు. ‘ఏకలవ్య ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో 2015 నుంచి 2021 మధ్యకాలంలో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఫౌండేషన్‌ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లోనూ సేవలందించింది.

అసలే పోటాపోటీ.. ఆపై అనూహ్య నిర్ణయం! 

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం పార్లమెంట్‌ స్థానానికి భాజపా ఆశావహులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ముఖ్యనేతలు, అధిష్ఠానం ఆశీస్సుల కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో కమలం సత్తాచాటాలనే ఆలోచనతో అగ్రనేతలు సైతం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఆశావహుల బలాబలాలను బేరీజు వేశారు. ఇతర పార్టీల్లోంచి బలమైన నేతలెవరైనా మొగ్గుచూపుతున్నారా? అనే అంశాన్నీ పరిశీలించారు. చివరగా వినోద్‌రావు అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. కమలం టికెట్‌ ఆశించి ఇటీవల ఆ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు భంగపాటు తప్పలేదు. బలమైన అభ్యర్థిని అన్వేషిస్తున్న తరుణంలో కమల తీర్థం పుచ్చుకున్నందున ఆయనకు అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉందన్న ప్రచారమూ జరిగింది. జలగం సైతం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్యంగా వినోద్‌రావు అభ్యర్థిత్వం వైపు అధిష్ఠానం మొగ్గుచూపింది. తన పేరును ఖరారు చేసిన అగ్రనేతలు, రాష్ట్ర,  జిల్లా నాయకత్వానికి తాండ్ర ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో ఈ సారి కమలం జెండా ఎగురవేసి ప్రధాని నరేంద్రమోదీకి కానుకగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని