logo

జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం

ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు.

Updated : 19 Apr 2024 05:21 IST

 శ్రీరాముడి కిరీటం చూపుతున్న వైదిక పెద్దలు

భద్రాచలం, భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. అన్ని లోకాలకు రక్షకుడై జగాలను ఏలిన జగదానందకారకుడి పట్టాభిషేకం చూసి తరించారు. వేడుకను వీక్షించి పులకించారు. వైదిక పెద్దల ప్రవచనాలతో భక్తిపారవశ్యులై రెండు చేతులు పైకెత్తి మొక్కుకున్నారు. కల్యాణం కమనీయమై కనులకు విందు చేయగా ఆ మరుసటి రోజైన గురువారం.. సీతారాముల పట్టాభిషేకం బ్రహ్మానందాన్ని చాటింది. ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, అధికారులు పట్టువస్త్రాలను సమర్పించారు.

స్వామివారికి మొక్కుతున్న గవర్నర్‌ రాధాకృష్ణన్‌ దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, ఈఓ రమాదేవి తదితరులు

 రామచంద్రుడి వైభవం: దేవాలయాన్ని తెరిచిన తర్వాత అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి నామార్చన చేసి ఆరాధన కొనసాగించారు. మూర్తులను శోభాయాత్రగా మాడవీధుల గుండా మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. సీతారాముల వారు మండపంలో వేంచేసి దర్శనమిచ్చారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం వేడుకగా సాగింది. ఆభరణాల ప్రదర్శన తన్మయత్వాన్ని నింపింది. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని అలంకరించుకున్న రామయ్య రాచఠీవిని ఒలకబోశాడు. ఛత్ర చామరాలు, పాదుకలు సమర్పించి ఖడ్గాన్ని వైదికులు అలంకరించారు. కిరీటాన్ని ధరింపజేశారు. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుని వైభవాన్ని చూడ కన్నులు చాలలేదు. పుణ్యతీర్థాలతో    అభిషేకం వైభవంగా జరిగింది.

 సుఖశాంతులను అందించే దైవం: ఆలయ దర్శనం చేసుకున్న ఇన్‌ఛార్జి  గవర్నర్‌ రాధాకృష్ణన్‌.. శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించారు. మిథిలా మండపం వద్ద సాష్టాంగపడి భక్తిని చాటారు. స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, ఉప ప్రధానార్చకులు శ్రీమన్నారాయణాచార్యులు, గోపాలకృష్ణమాచార్యులు, ఎ.మురళీకృష్ణమాచార్యులు, రామస్వరూప్‌, రామాయణ పారాయణదారు కృష్ణమాచార్యులు పర్యవేక్షణలో పూజలు చేశారు. శరణుకోరి వచ్చిన భక్తులను కాపాడే దైవం రామయ్య అని వైదిక పెద్దలు వివరించారు.  అందరికీ సుఖశాంతులు సమకూర్చే దైవం సీతారాముడు అని సుభాషించారు. రామబంటు ఆంజనేయుడి భక్తి గురించి విశ్లేషించడంతో భక్తులు తన్మయులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ పట్టాభిషేకం వేదిక వద్ద విధుల్లో ఉన్న అధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఉత్సవ ఏర్పాట్లను ఈఓ రమాదేవి, ఈఈ రవీంద్రనాథ్‌, శానిటరీ  ఇన్‌స్పెక్టర్‌ రామారావు, సూపరింటెండెంట్లు పర్యవేక్షించారు. దేవనాధ రామానుజ జీయర్‌స్వామి, దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఐజీ రాజేశ్‌, కలెక్టర్‌ ప్రియాంక, ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు అభినందనలు:   శ్రీరామనవమి, పట్టాభిషేకం మహోత్సవాలను ఘనంగా నిర్వహించటంలో అధికారులు, ఉద్యోగులు   కీలకంగా వ్యవహరించారని దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ ప్రియాంక అల అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లా, రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తగ్గిన రద్దీ

ఇంతకుముందుతో పోల్చితే ఈసారి కల్యాణంతో పాటు పట్టాభిషేకం మహోత్సవానికి రద్దీ తగ్గింది. ప్రచారంలో లోపమెక్కడ ఉందో గుర్తించాలి. కొన్ని సెక్టార్లు భక్తులు లేకుండా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇందుకు గల కారణాలను సమీక్షించుకుని భవిష్యత్తులో భక్తుల సంఖ్య పెరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.

నేడు ఖమ్మంలో రాజ్‌నాథ్‌సింగ్‌ రోడ్‌ షో

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మంలో శుక్రవారం నిర్వహించే రోడ్‌షోలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొంటారని  భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు పేర్కొన్నారు. ఖమ్మంలో గురువారం  మాట్లాడారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాను నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. సర్దార్‌ పటేల్‌ స్టేడియం, జడ్పీ సెంటర్‌, మయూరి సెంటర్‌ మీదుగా పెవిలియన్‌ మైదానం వరకు మధ్యాహ్నం జరిగే రోడ్‌షోలో రాజ్‌నాథ్‌సింగ్‌,  రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని వివరించారు. మోదీని మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, సన్నే ఉదయ్‌ ప్రతాప్‌, గల్లా సత్యనారాయణ, దొంగల సత్యనారాయణ, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పర్యటన వివరాలు..: హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.40 గంటలకు ఖమ్మంలో సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 నుంచి 3.40 గంటల వరకు రోడ్‌షో, ర్యాలీలో పాల్గొంటారు. 3.50 గంటలకు సర్దార్‌ పటేల్‌ స్టేడియం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి విజయవాడ (గన్నవరం) విమానాశ్రయం చేరుకుంటారు. రాజ్‌నాథ్‌సింగ్‌ తొలిసారి ఖమ్మం వస్తున్నారు.

వైభవంగా రాములోరి రథోత్సవం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి కోవెలలో రథోత్సవం గురువారం రాత్రి  వైభవోపేతంగా సాగింది. రథం లాగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. రాజవీధిలో అడుగడుగునా మహిళలు హారతులు అందించి జగదేకవీరుడైన రామయ్యను ఘనంగా ఆహ్వానించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పట్టాభిషేక వైభవాన్ని వీక్షించిన భక్తులకు రాత్రిపూట రథోత్సవం తిలకించే భాగ్యం కలగడంతో ఆనందపరవశులయ్యారు. ఏర్పాట్లను ఈఓ రమాదేవి పర్యవేక్షించారు. ఏఈఓ భవానీరామకృష్ణ, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన పి.కృష్ణారావు అనే భక్తుడు రామయ్యను దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. సూపరింటెండెంట్‌ నిరంజన్‌ ద్వారా  రూ.1,01,116 విరాళాన్ని అన్నదానం ఖాతాకు జమ చేశారు.

నేడు భద్రాద్రిలో సదస్యం

సదస్యం శుక్రవారం జరుగుతుంది. భక్తులను సంతోష సాగరంలో ముంచెత్తుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న వేదపండితులు భద్రాచలం తరలివచ్చి సీతారాముల వారికి వేదాశీర్వచనం అందిస్తారు. చతుర్వేద విద్వాంసులతో పాటు ద్రవిడ వేదపండితులు స్వామికి   వేదాలతో ఆశీర్వచనం పలికి సదస్యం అనే ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పట్టాభిషేకం తర్వాత రోజు సదస్యం చేయటం ఆనవాయితీగా వస్తోంది.    మంగళవారంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

అంకమ్మతల్లి తిరునాళ్ల గోడపత్రికల ఆవిష్కరణ

అన్నపురెడ్డిపల్లి, న్యూస్‌టుడే: అన్నపురెడ్డిపల్లిలోని అంకమ్మతల్లి తిరునాళ్ల గోడపత్రికలను ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు. భద్రాచలంలో పట్టాభిషేక కార్యక్రమానికి వచ్చిన ఆయన భద్రాచలం రామాలయ ఈఓ రమాదేవి, ఆలయ అభివృద్ధి, హరిహర ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మారగాని శ్రీనివాసరావుతో కలిసి గోడపత్రికలను విడుదలచేశారు. గురువారం నుంచి మంగళవారం వరకు జరగనున్న తిరునాళ్లకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక  సంఖ్యలో వస్తారని అధికారులు వివరించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, గవర్నర్‌ సంయుక్త కార్యదర్శి భవానీశంకర్‌, అధ్యాత్మిక వక్త దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని