logo

శ్రీసూర్యనారాయణా.. తేజోమయా

నందికొట్కూరు పట్టణం కోటా వీధిలోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది.

Published : 28 Jan 2023 01:48 IST

నేడు రథసప్తమి

నందికొట్కూరులోని సూర్యనారాయణ స్వామి ఆలయం

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నందికొట్కూరు పట్టణం కోటా వీధిలోని సూర్యదేవుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో రెండవ సూర్యనారాయణ స్వామి దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సూర్యారాధన చేసినవారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యకిరణాలు గాలిగోపురంగుండా మంటపాన్ని దాటుకుని గర్భగుడిలోని మూలవిరాట్‌ విగ్రహం వక్షస్థలాన్ని తాకుతాయి. ప్రతి ఆదివారం వందలాది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి యాగాలు నిర్వహిస్తారు. పదమూడో శతాబ్దంలో చోళ వంశీయుడైన సిరిసింగరాయుడు వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చాడని, అలసటతో అక్కడే ఉన్న ఓ వృక్షం కింద నిద్రిస్తుండగా సూర్యనారాయణస్వామి కలలోకి వచ్చి నిద్రిస్తున్న ప్రాంతంలో తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించినట్లు స్థలపురాణం ప్రచారంలో ఉంది. ఆలయంలో కూర్మ యంత్రం ఉండటం విశేషం. మూలవిరాట్‌ కుడిచేతుల్లో తెల్లటి పద్మం, ఎడమచెయ్యి అభయముద్రలో ఉంటుంది.

28న కల్యాణోత్సవం

ఈనెల 28వ తేదీన రథసప్తమి, సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని ఛాయా ఉషాసమేత సూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు దేవాలయం కమిటీ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటలకు స్వామి అభిషేకం, ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కుంకుమార్చన, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. భక్తులకు మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుందన్నారు. సాయంత్రం 3 గంటలకు పురవీధుల గుండా కల్యాణమూర్తుల రథోత్సవం నిర్వహిస్తారు.

స్వామి మూలవిరాట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని