logo

పశ్చిమాన ప్రాజెక్టులు భ్రష్టు పట్టించారు

ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్క్‌కు వంద ఎకరాలు కేటాయిస్తే దాన్ని స్థిరాస్తి వెంచర్‌గా మార్చారు...  రైతులకు సాగునీరందించడానికి ఆర్డీఎస్‌ కోసం రూ.1984 కోట్లతో టెండర్‌ పిలిస్తే వైకాపా ప్రభుత్వం పనుల్ని ఆపేసింది..

Published : 17 Apr 2024 03:41 IST

జగన్‌ తీరుపై మండిపడ్డ బాలకృష్ణ

మాట్లాడుతున్న బాలకృష్ణ, వేదికపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి, ఎంపీ అభ్యర్థి నాగరాజు

మ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్క్‌కు వంద ఎకరాలు కేటాయిస్తే దాన్ని స్థిరాస్తి వెంచర్‌గా మార్చారు...  రైతులకు సాగునీరందించడానికి ఆర్డీఎస్‌ కోసం రూ.1984 కోట్లతో టెండర్‌ పిలిస్తే వైకాపా ప్రభుత్వం పనుల్ని ఆపేసింది.. గాజులదిన్నె నుంచి రూ.146 కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరిచ్చే పథకాన్ని తెదేపా మంజూరు చేస్తే వైకాపా నాయకులు పనులు ఆపేశారు.. ఎమ్మిగనూరువాసుల తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా గుడేకల్లులో వంద ఎకరాల్లో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మించడానికి తెదేపా ప్రయత్నిస్తే... వైకాపా నాయకులు ఆ భూమిని స్థిరాస్తి వెంచర్లుగా మార్చి... రూ.250 కోట్ల విలువైన ఆ భూమిని స్వాహా చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా మంగళవారం కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కొనసాగింది. ఎమ్మిగనూరు, కోసిగిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

చేనేతపురి జనసంద్రం

అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. క్రేన్ల సాయంతో గజమాలలు వేసి సన్మానించారు. కర్నూలు రోడ్‌ నుంచి ఎద్దుల మార్కెట్‌ మీదుగా శివ సర్కిల్‌ వరకు బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించారు. అంచనాలకు మించి జనం భారీగా తరలివచ్చారు. ప్రచారరథం పైనుంచి బాలకృష్ణ ప్రజలకు అభివాదం చేస్తూ శివ సర్కిల్‌లో ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. రోడ్‌షోలో వేలాది మంది తెదేపా నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. శివ సర్కిల్‌లో ఎటుచూసినా జనమే కనిపించారు. సర్కిల్‌ నుంచి నాలుగు వైపులా ఉన్న రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.

ఎమ్మిగనూరులో సభకు హాజరైన జనం


చేనేతల ఆత్మహత్యల పర్వం....

శంకరయ్య అనే చేనేత కార్మికుడు రెండు సెంట్ల భూమి కోసం తీవ్ర క్షోభ అనుభవించి చివరకు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్టలో ముగ్గురు చేనేతలు భూమాఫియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. అప్పుల బాధ తాళలేక పెడనలో ముగ్గురు, ధర్మవరంలో ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. గోనెగండ్ల మండలానికి చెందిన హజీరాబీని అత్యాచారం చేసి చంపేశారు. వైకాపా వాళ్లు చేసిన దారుణాలెన్నో ఉన్నాయన్నారు. ఓటును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలన్నారు. జగన్‌ దుర్మార్గ పాలనను ప్రజలంతా ఏకమై మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. తెదేపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీవీ జయనాగేశ్వరరెడ్డిని, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజును గెలిపించాలని కోరారు.


ఎర్రకోటకు బీటలు

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సోదరుల కుమారులు ఐదుగురు బాలకృష్ణ సమక్షంలో మంగళవారం తెదేపాలో చేరారు. ఎమ్మిగనూరు పరిధిలో 50 ఏళ్లపాటు రాజకీయం చేసిన ఆయన ఎర్రకోట, కడిమెట్ల, రాళ్లదొడ్డి, సిరాలదొడ్డి, గువ్వలదొడ్డి గ్రామాలను తనకు కంచు కోటలుగా మార్చుకున్నారు. ఆయా గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీ కార్యకలాపాలేవీ జరగకుండా, ప్రతిపక్ష పార్టీకి ముఖ్యమైన నాయకులు కూడా లేకుండా చేశారు. ఆయా గ్రామాల్లో ఆయన అనుచరులు చెప్పిందే వేదం అన్నట్లుగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ సుమారు 12 వేల ఓట్లు ఆయా గ్రామాల నుంచి ఆయనకు పడేవి. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ఆయా గ్రామాల్లో దశాబ్దాలుగా వెన్నుదన్నుగా ఆయన సోదరుల కుమారులు, పలువురు నాయకులు తెదేపాలో చేరడం సంచలనంగా మారింది.  

కడిమెట్ల గ్రామానికి చెందిన విరూపాక్షిరెడ్డి, చెన్నారెడ్డి, బాలకృష్ణారెడ్డి, రాళ్లదొడ్డికి చెందిన కరుణాకర్‌రెడ్డి, చెన్నారెడ్డి తమతమ అనుచర వర్గాలతో ఎమ్మిగనూరు వచ్చి బాలకృష్ణ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ నాయకులే ఐదు గ్రామాల్లో ఎమ్మెల్యే తరపున కీలక వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. ప్రతి ఎన్నికల్లో ఆయా గ్రామాల ఓట్లు గంపగుత్తగా చెన్నకేశవరెడ్డికి పడటంలో కీలకపాత్ర పోషించేవారు. అలాంటి కీలక నాయకులు తెదేపాలో చేరడం ఆసక్తికరంగా మారింది.  


విద్యుత్తు ఆపేసి కక్ష సాధించారు..

బాలకృష్ణ సభ జరుగుతున్నంతసేపూ ఎమ్మిగనూరులో విద్యుత్తు సరఫరా ఆపేసి ప్రజలు ఆ కార్యక్రమాన్ని చూడకుండా అధికారులు అడ్డుకోవడం గమనార్హం. విద్యుత్తు అంతరాయాల కారణంగా మైకులు సరిగా వినిపించని పరిస్థితి తలెత్తింది. బాలకృష్ణ ప్రసంగం అందరికీ స్పష్టంగా వినిపించేందుకు వీలుగా పలుచోట్ల భారీ స్పీకర్లు ఏర్పాటుచేసినప్పటికీ విద్యుత్తు సరఫరా లేక కొన్ని స్పీకర్లు పనిచేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని