logo

జగన్‌తత్వం కుతంత్రం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్‌ 32, మైనర్‌ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

Updated : 17 Apr 2024 05:21 IST

పంచాయతీలకు మరణ శాసనం రాసిన వైకాపా
పల్లె ప్రథమ పౌరులను అప్పుల్లో ముంచిన సర్కారు
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

మ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్‌ 32, మైనర్‌ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆర్థిక సంఘం, సాధారణ, సీనరేజీ నిధులు పంచాయతీలకు ప్రధాన ఆదాయం. జగన్‌ గద్దెనెక్కిన తర్వాత పంచాయతీ నిధులు దారి మళ్లిస్తున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేసేందుకు సొమ్ముల్లేవు.. మంచినీటి పైప్‌లైన్ల మరమ్మతులకు పైసల్లేవు.. ఆఖరికి బ్లీచింగ్‌, ఫాగింగులకూ డబ్బు వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. ఏ పని చేయడానికి కూడా సర్పంచుల దగ్గర సరిపడా సొమ్ము లేకుండా చేశారు జగన్‌. ఏదీ చేయలేక గ్రామస్థులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని సర్పంచులు నెత్తీనోరూ కొట్టుకున్నా జగన్‌ వినిపించుకోలేదు.


‘ప్రాధాన్యం’ మరిచి.. ఉపాధి నిధులు ధారబోసి

అంతకు ముందు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేవారు. జగన్‌ వచ్చాక వాటికీ టెండర్‌ పెట్టారు. ప్రతి పంచాయతీలో సచివాలయం, ఆరోగ్య, ఆర్బీకే, పాలకేంద్రం, డిజిటల్‌ గ్రంథాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి ప్రాధాన్య భవనాలుగా నామకరణం చేసింది.. అన్నీ కలిపి ఉమ్మడి జిల్లాలో 1,452 నిర్మించాలని నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో 60 శాతం కూలీలకు, 40 శాతం సామగ్రి విభాగం కింద ఖర్చు చేయాలనేది నిబంధన పెట్టారు. ప్రభుత్వం ఒత్తిడి చేసి స్థానిక నేతలకు పనులు అప్పగించింది. చాలా మంది సొంత డబ్బులు వెచ్చించారు. ఇంకా రూ.26 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. పల్లెల అవసరాలను పట్టించుకోకుండా సొంత ప్రాధాన్య కార్యక్రమాలకు ‘ఉపాధి’ నిధులు ధారపోశారు.


ఆర్థిక సంఘం నిధులు హాంఫట్‌

కొన్ని మేజర్‌ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు ఉండవు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెలను ప్రగతి బాట పట్టించాలి. జగన్‌ ఆ పని చేయకపోగా వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ ‘హాంఫట్‌’ అనిపించేశారు. రాష్ట్రం సాధారణ నిధులనూ వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2021-22, 2022-23 సంవత్సరాల్లో కలిపి దాదాపు రూ.180 కోట్ల వరకు విద్యుత్తు బిల్లుల బకాయిలకు మళ్లించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత రూ.59 కోట్లు మంజూరయ్యాయి. వాటినీ మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని పల్లె పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల్లో పది శాతాన్నే పరిపాలన అవసరాలకు వెచ్చించాలి. ఆ సొమ్ములోంచే విద్యుత్తు బకాయిలను చెల్లించాలి. కానీ, జగన్‌ సర్కారు మాత్రం సగటున 24 శాతం నుంచి 90 శాతం వరకు ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల నుంచి ఖాళీ చేసింది.


ప్రజల కష్టాలు గుర్తించని నీరో చక్రవర్తి

ఉమ్మడి జిల్లాలో 672 గ్రామాల్లో 4.75 లక్షల మందికి సగటున నిత్యం 50 లీటర్ల నీటిని అందించే ఉద్దేశంతో జల్‌జీవన్‌ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. రెండు జిల్లాల్లో రూ.201 కోట్లతో చేపట్టే 1,008 పనులను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నాలుగు విడతల్లో టెండర్లు పిలించారు. కేంద్రం తన వాటా నిధులు అందించినా.. రాష్ట్రం నిధులు జమ చేయలేదు. దీంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. నంద్యాలలో రూ.58 కోట్ల పనులు జరగ్గా 20 శాతం కూడా బిల్లులు చెల్లించలేదు. కర్నూలులో ఇప్పటివరకు కేవలం రూ.30 కోట్ల పనులే జరిగాయి.  ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 594 గ్రామాల్లో జలఘంటికలు మోగుతున్నాయి.


గనుల వాటా గయాబ్‌

  • గనుల ఆదాయంలో గ్రామాల వాటాకు ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. సీనరేజీ నిధులు వసూలు చేస్తున్నా గ్రామాల ఖాతాల్లో కన్పించడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గనులు లీజుకు ఇవ్వడంతో ఏటా రూ.80 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. లీజుదారుల నుంచి మైనింగ్‌ శాఖ అధికారులు పన్ను వసూలు చేస్తారు. వాటిని డీపీవో ఖాతాలకు బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఆమోదం మేరకు డీపీవోలు పంచాయతీలకు బదిలీ చేస్తారు.
  • నిబంధనల మేరకు ఆదాయంలో 25 శాతం పంచాయతీలకు, 50 శాతం మండల పరిషత్తులకు, 25 శాతం జడ్పీలకు కేటాయించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొలిమిగుండ్ల, అవుకు, బేతంచెర్ల, డోన్‌ మండలల నుంచే రూ.8 కోట్లు సీనరేజీ కింద ప్రభుత్వానికి సమకూరింది. కానీ పంచాయతీలకు ఈ నిధులు బదిలీ చేయలేదు.

ప్రగతి దీపాలు కొండెక్కించారు

సంప్రదాయ వీధి దీపాల వ్యవస్థ స్థానంలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్‌ఎల్‌), నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీ)లకు వీటి ఏర్పాటుతోపాటు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అప్పగించింది. వైకాపా వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్వహణ సంస్థలకు నిధులు సరిగా చెల్లించలేదు. 2021 మార్చి నుంచి వీధి దీపాల నిర్వహణను పంచాయతీలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. పంచాయతీల వద్ద నిధుల్లేక వీధి దీపాలు వెలగడం లేదు.

  • పల్లెల్లో చెత్తను సేకరించి సంపదగా మార్చుతామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ఉమ్మడి జిల్లాలో గ్రామాల్లో 25 లక్షల జనాభా ఉంది. ఒక్కో పంచాయతీ నుంచి 400 కిలోల చెత్తను సేకరిస్తున్నారనుకున్నా...రోజుకు 400 టన్నుల చెత్త, 60 శాతం ఎరువు వస్తుంది. దీన్ని కిలో రూ.5 చొప్పున విక్రయించినా రోజుకు రూ.1.25 లక్షలు వస్తుంది. కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఆదాయం లేదు.

నీటి ఎద్దటి నివారణకు  రూ.22.75 కోట్లు అవసరమని అంచనా వేశారు. గత నెలలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని