logo

పోలింగ్‌ శాతం పెంచేలా చర్యలు

విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ జి.సృజన అన్నారు.

Published : 18 Apr 2024 03:06 IST

కలెక్టర్‌ డా.సృజన

ఈనాడు, కర్నూలు: విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ జి.సృజన అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలోని జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన సీఐకి ఛార్జి మెమో ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 85 శాతం పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైన నియోజకవర్గాలు, ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఓటరు చైతన్యంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో నామపత్రాలు సమర్పించేవారు ఆ పత్రాల కాపీని తప్పనిసరిగా రిటర్నింగ్‌ అధికారులకు ఇవ్వాల్సిందేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. సి.విజిల్‌ యాప్‌నకు పెద్దఎత్తున ఫిర్యాదు వస్తున్నాయని.. గతంలో పరిష్కార శాతం 64 శాతం ఉండగా.. 89 శాతానికి పెంచినట్లు చెప్పారు.

294 మంది వాలంటీర్ల రాజీనామా

జిల్లాలో ఇప్పటివరకు 294 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, వారందరి ఫోన్లు, సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్‌ డా.సృజన చెప్పారు. రాజీనామా చేసినవారు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటే ఏమి చేయాలన్న అంశంపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదన్నారు. రాజీనామా చేయాలంటూ వాలంటీర్లపై ఒత్తిడి చేస్తున్నట్లు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని.. ఎవరైనా ఒత్తిడి చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

1,503 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

జిల్లాలో ఉన్న 2,204 పోలింగ్‌ కేంద్రాల్లో.. 1,503 ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. వెబ్‌కాస్టింగ్‌ లేని పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. వారు కోరితే ఇంటి దగ్గరే ఓటు వేయించి పోస్టల్‌ బ్యాలెట్‌గా పరిగణిస్తామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తున్నామని.. నడవలేని వారి కోసం వీల్‌ఛైర్‌ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  

ప్రతి పైసా లెక్కిస్తారు

జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ డా.సృజన చెప్పారు. అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా చేసే ప్రతి ఖర్చును వారు లెక్కిస్తారని.. వ్యయ పరిశీలన నిశితంగా జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ చేయించి ఖర్చు లెక్కిస్తామన్నారు. పరిమితికి మించి ఖర్చు చేసినవారిని అనర్హులవుతారన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని