logo

మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్య

తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం.

Updated : 18 Apr 2024 05:15 IST

విద్యా సంవత్సరం ముగుస్తున్నా పత్తాలేని నిధులు
చెల్లించాలని విద్యార్థులపై యాజమాన్యాల ఒత్తిడి
కర్నూలు సంక్షేమం, న్యూస్‌టుడే 

తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. ఆపై తరగతుల విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.!!

- ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 2017 నవంబరు 21న నంద్యాల జిల్లా బేతంచెర్లకు వచ్చిన జగన్‌ కళాశాల విద్యార్థులతో సమావేశమై చేసిన వాగ్దానమిది!!

ధికార గద్దెనెక్కిన తర్వాత ‘విద్యా దీవెన’ పథకాన్ని తీసుకొచ్చారు. నమ్మిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపులు, క్రైస్తవ వర్గాలకు చెందిన వేలాది మంది పేద విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చేరారు. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్న హామీని మడత పెట్టేశారు. కొర్రీలు పెట్టి పథకానికి తూట్లు పొడిచారు. పేద విద్యార్థులను పెద్ద చదువులకు దూరం చేశారు.

గ్రేడ్లుగా విభజించి.. సాయం తగ్గించి

ఉమ్మడి జిల్లాలో 76,975 మంది విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరంతా విద్యా దీవెనకు అర్హత సాధించారు. కళాశాలలను గ్రేడ్లుగా విభజించి ఏ-గ్రేడ్‌ కళాశాలలో చదివే వారికి ఏడాదికి రూ.18,400, బీ-గ్రేడ్‌ కళాశాలకు రూ.15,300 చొప్పున, కనిష్ఠంగా రూ.13,200 చొప్పున విడుదల చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు ఇవ్వకపోగా.. ఇచ్చే మొత్తాన్ని నాలుగు విడతల్లో జమ చేస్తున్నారు. కర్నూలుకు రూ.23.95 కోట్లు, నంద్యాలకు రూ.20.78 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది. తెదేపా హయాంలో ఉన్నత విద్య చదువుకునే వారికి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకాలను అమలు చేశారు. వైకాపా ప్రభుత్వం మాత్రం డిగ్రీ విద్యార్థులకు మాత్రమే విద్యా దీవెన అమలు చేస్తోంది.

బటన్‌ నొక్కారు.. సాయం మరిచారు

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు విడతలుగా చెల్లించాల్సిన విద్యా దీవెన సొమ్ములో ఒక విడత మాత్రమే విడుదల చేశారు. ఎన్నికల ప్రకటన వస్తుందని గత నెల 1న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హడావుడిగా బటన్‌ నొక్కారు. ఇప్పటికీ 30 శాతం మంది తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ కాలేదు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా మూడు విడతల సొమ్ము బకాయిలున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యా దీవెన పథకానికి అర్హులైన వివిధ వర్గాల విద్యార్థులు 76,975 మంది ఉన్నారు. వీరికి ఏటా ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ అందాలి. ఇప్పటి వరకు గతేడాదికి సంబంధించి ఒక విడత మాత్రమే నిధులు విడుదల చేశారు. అవి కూడా చాలా మందికి రాలేదు.

కరోనా కాలం ఆపేశారు

అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ (పీజీ) విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన రుసుము చెల్లించబోమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కరోనా సమయంలో తరగతులు నిర్వహించనందున ఈ మొత్తం ఇవ్వడం లేదని పేర్కొంది. కానీ, కరోనా సమయంలో కళాశాలలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో బోధించాయి. పరీక్షలూ నిర్వహించాయి. దీంతో విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేసుకున్నాయి. ప్రభుత్వం మాత్రం అసలు తరగతులే జరగలేదని ఫీజులను ఎగ్గొట్టి.. పేద కుటుంబాలపై భారం మోపింది.

సర్కారు రాజకీయ ఆట

తెదేపా ప్రభుత్వ హయాంలో అయిదేళ్లపాటు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ నిధులను నేరుగా కళాశాలలకే విడుదల చేసేవారు. వైకాపా వచ్చిన తర్వాత ఫీజుల చెల్లింపు ప్రక్రియను జగన్‌ సర్కారు రాజకీయంగా వాడుకోవాలనుకుంది. కళాశాలల ఖాతాల్లో జమ చేసే విధానానికి స్వస్తి చెప్పి తల్లుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. విద్యార్థుల ఓట్ల కోసం విద్యార్థి, తల్లి సంయుక్త ఖాతాలో జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. రీఎంబర్స్‌మెంట్‌ డబ్బులను ప్రభుత్వమే నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నందున వాటితో తమకు సంబంధం లేదంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి.

పీజీకి తాళం వేశారు

తెదేపా ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇచ్చేది. జగన్‌ ప్రభుత్వం దీన్ని ఆపేసింది. దీంతో పీజీ చదివే విద్యార్థులు సంఖ్య తగ్గిపోయింది. ఈ ప్రభావంతో నంద్యాలలో మూడు ప్రైవేటు పీజీ కళాశాలలు మూతపడ్డాయి. నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, కోవెలకుంట్లలో ఒక్కో కళాశాల మూతపడ్డాయి. కర్నూలులో ఐదు, ఎమ్మిగనూరు, ఆదోనిలో మరో రెండు కళాశాలలు మూతపడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలలు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరే వారే కరవయ్యారు. బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎమ్మెస్సీ గణితం, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఎంకాం వంటి కోర్సుల బోధనను ఆపేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని