logo

బలగం పెంచుకుని బరిలోకి!

వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు.

Published : 24 Apr 2024 05:36 IST

కోడుమూరులో తెదేపాలోకి వలసలు
వైకాపాను వీడుతున్న కీలక నేతలు

ఈనాడు, కర్నూలు: వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. పసుపు దళం బలగం పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గంలో 1962 నుంచి 2019 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి మొదటిసారి 1962లో దామోదరం సంజీవయ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు.  తెదేపా ఒక్కసారే జెండా ఎగురవేసింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారు.

అధికారంలో విభేదాలు

నియోజకవర్గంలో కుడా మాజీ ఛైర్మన్‌ హర్షవర్దన్‌రెడ్డికి, ప్రస్తుత ఎమ్మెల్యే డా.సుధాకర్‌కు ఆది నుంచి విభేదాలు ఉన్నాయి. ఆదిమూలపు సతీశ్‌కు టికెట్‌ ఇప్పించడం వెనకు హర్షవర్దన్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని డా.సుధాకర్‌ గుర్రుగా ఉన్నారు.ఎమ్మెల్యే సుధాకర్‌ వైకాపాను వీడనప్పటికీ ప్రస్తుత అధికార పార్టీ అభ్యర్థికి ఏమాత్రం సహకరించడం లేదు.  

తెదేపా ‘స్థానిక’ అస్త్రం

డా.సతీశ్‌ స్థానికేతరుడన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి కర్నూలుకు వలస వచ్చారు. తెదేపా అభ్యర్థి దస్తగిరి కోడుమూరు  పసుపల గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన తల్లి ప్రస్తుతం సర్పంచిగా కొనసాగుతున్నారు.  దస్తగిరి స్థానికుడు.. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

సైకిలెక్కిన ప్రజాప్రతినిధులు

ఎమ్మెల్యే డా.సుధాకర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన సి.బెళగల్‌ జడ్పీటీసీ సభ్యుడు గిరిజోన్‌ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఇదే మండలానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, గార్గేయపురం వైస్‌ ఎంపీపీ జూటూరు శైలజారెడ్డి, గార్గేయపురం ఉప సర్పంచి కౌశిక్‌రెడ్డిలు సైకిలెక్కారు.  ముడుమలగుర్తి సర్పంచి సువర్ణ తిరిగి తెదేపాలో చేరారు. గోరంట్ల సర్పంచి సద్దల బాలకృష్ణ, కళ్లపరి సర్పంచి రంగమ్మ, పులకుర్తి గ్రామానికి చెందిన మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ ఇమ్మాన్యుయేల్‌ తదితరులు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకొన్నారు. కర్నూలు నగర పాలక సంస్థ 38వ వార్డు కార్పొరేటర్‌ గిబ్సన్‌ వైకాపాను వీడి తెదేపాలోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

గళమెత్తుతున్న జనం

నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా మంచినీటి సమస్యల తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోనే పెద్ద మండలం కోడుమూరు.. ఇక్కడి జనాలకు మంచినీటి కష్టాలు తీర్చేందుకు గాజులదిన్నె నుంచి పైపులైను వేయాల్సి ఉంది. దీన్ని పట్టించుకోలేదు. ఇటీవల బస్సు యాత్రలో భాగంగా సీఎం జిల్లాలో పర్యటించారు. కోడుమూరు మండలం కొత్తూరుకు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సతీశ్‌లు ఇటీవల సి.బెళగల్‌ మండలంలో ప్రచారానికి వెళ్లగా గ్రామస్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానాలు చెప్పలేక ‘నీళ్లు’నమిలారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని