logo

చెట్ల కొమ్మలతో దాడి చేసి వ్యక్తి హత్య

పాత కక్షలతో వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మండలంలో జరిగింది. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాలు.. ఉండవల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి(35).. కుటుంబంతో కలిసి ఐదేళ్లుగా కర్నూలులో ఉంటున్నారు.

Published : 05 Feb 2023 05:43 IST

దాడికి పాల్పడిన వ్యక్తి ఇంటి వద్ద మృతదేహాంతో బాధితులు (మధుసూదన్‌రెడ్డి)

ఉండవల్లి, న్యూస్‌టుడే : పాత కక్షలతో వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మండలంలో జరిగింది. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాలు.. ఉండవల్లికి చెందిన మధుసూదన్‌రెడ్డి(35).. కుటుంబంతో కలిసి ఐదేళ్లుగా కర్నూలులో ఉంటున్నారు. వెల్డింగ్‌ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఉండవల్లికి చెందిన ఈడిగ రాఘవేంద్రగౌడ్‌ మధుసూదన్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. అయిదేళ్ల కిందట మధుసూదన్‌రెడ్డి భార్య విషయంలో జరిగిన ఘర్షణ గురించి మాట్లాడేందుకు రావాలంటూ తిట్టాడు. మధుసూదన్‌రెడ్డి ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు వారించి ఉండవల్లికి వెళ్లకుండా ద్విచక్రవాహన తాళాన్ని దాచారు. దీంతో బయటకు వెళ్లిన ఆయన వెల్డింగ్‌ దుకాణంలో పనిచేసే అనిల్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారి నుంచి ఉండవల్లికి వచ్చే రోడ్డులో కాపుకాసిన ఈడిగ రాఘవేంద్రగౌడ్‌, ఆయన మిత్రులు యాగంటి నాయుడు, గణేశ్‌, రూబీ కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న వారిని అడ్డుకున్నారు. చెట్ల కొమ్మలను విరిచి మధుసూదన్‌రెడ్డిపై దాడి చేశారు. అడ్డుకున్న అనిల్‌కుమార్‌ను సైతం కొట్టడంతో ఆయన దాడి విషయాన్ని మధుసూదన్‌రెడ్డి భార్య కృష్ణవేణికి ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర గాయాలైన మధుసూదన్‌రెడ్డిని అనిల్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఉండవల్లికి వస్తున్న కృష్ణవేణి, ఆమె బావ మద్దిలేటిరెడ్డి వారిని గుర్తించారు. మధుసూదన్‌రెడ్డిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మధుసూదన్‌రెడ్డి అన్న మద్దిలేటిరెడ్డి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన నలుగురిపై ఎస్సై బాలరాజు కేసు నమోదు చేశారు. శాంతినగర్‌ సీఐ శివశంకర్‌గౌడ్‌ దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు. బాధితులు మృతదేహంతో శనివారం సాయంత్రం ఉండవల్లిలో ఈడిగ రాఘవేంద్రగౌడ్‌ ఇంటి వద్ద దాదాపు గంటపాటు ధర్నా చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రంగస్వామి బాధితులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. బాధితులు మృతదేహాన్ని అక్కణ్నుంచి తీసుకెళ్లారు. సీఐ శివశంకర్‌గౌడ్‌, కోదండపురం ఎస్సైలు శ్రీనివాసులు నాయక్‌, వెంకటస్వామి, ఏఎస్సై అయ్యన్న, పోలీసుసిబ్బంది భద్రతను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని