logo

‘ఉమామహేశ్వర’తో నల్లమలకు సాగునీరు

రాష్ట్ర మంత్రిమండలి గురువారం తీసుకున్న పలు నిర్ణయాలు పాలమూరుపై ప్రభావం చూపనున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం ఫేజ్‌-1, ఫేజ్‌-2 మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

Published : 19 May 2023 05:42 IST

సీఎంకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ప్రభుత్వ విప్‌ గువ్వల  బాలరాజు. చిత్రంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌ : రాష్ట్ర మంత్రిమండలి గురువారం తీసుకున్న పలు నిర్ణయాలు పాలమూరుపై ప్రభావం చూపనున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం ఫేజ్‌-1, ఫేజ్‌-2 మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,534 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఫేజ్‌-1లో భాగంగా బల్మూరు మండలం మైలారం సమీపంలో ఉమామహేశ్వర జలశాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఫేజ్‌-2లో అమ్రాబాద్‌ మండలం మన్ననూరు సమీపంలో చెన్నకేశవ జలాశయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు వస్తే నల్లమలకు కృష్ణా జలాల ద్వారా సాగునీరు సరఫరా జరుగుతుంది.
* మంత్రి మండలిలో రెండో విడత గొర్రెల పంపిణీని 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 68,340 యూనిట్లను పంపిణీ చేయనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మాదాసి కురవలకు అదనంగా మరో 30వేల యూనిట్ల పంపిణీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో 67 వేల యూనిట్లను పంపిణీ చేశారు. ఇప్పటికే  కలెక్టర్ల పర్యవేక్షణలో రెండో విడతలో మహబూబ్‌నగర్‌లో 16,167 యూనిట్లు, గద్వాల-8,354, వనపర్తి-11,667, నాగర్‌కర్నూల్‌-19,762, నారాయణపేట జిల్లాలో 12,390 యూనిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
* కొత్త మండలాల్లో పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తామని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2016లో కొత్తగా ఏర్పడిన పలు మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి, కేటీదొడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ, వనపర్తి జిల్లా చిన్నంబావి, అమరచింత, నారాయణపేట జిల్లా కృష్ణలో పీహెచ్‌సీలు ఏర్పాటు చేయలేదు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాలో కౌకుంట్ల, నారాయణపేట జిల్లాలో కొత్తపల్లి, గుండుమాల్‌ను మండల కేంద్రాలుగా మార్చారు. కౌకుంట్ల, కొత్తపల్లిలో పీహెచ్‌సీలు లేవు. క్యాబినెట్‌ నిర్ణయంతో ఈ మండలాలకు పీహెచ్‌సీలు మంజూరయ్యే అవకాశాలున్నాయి.
* నకిలీ విత్తనాలపై పీడీ కేసులు నమోదు చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని భూత్పూర్‌, గద్వాల కేంద్రంగా సాగుతున్న పత్తి విత్తనాల కేంద్రాలపై దాడులు కొనసాగనున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. గద్వాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న వారిపై గతంలో పీడీ కేసులను నమోదు చేశారు. మూడు రోజుల కిందట నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. ఇప్పటికే ఠాణాలవారీగా అనుమానితులను గుర్తించి తహసీల్దార్ల వద్ద బైండోవర్‌ చేశారు. వానాకాలం సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో సుమారు 9 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే అవకాశాలున్నాయి. ఈ వర్షాకాలం సీజన్‌లో భారీగా పత్తి విత్తనాల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలపై పూర్తి స్థాయి నిఘా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

ఎత్తిపోతల మంజూరుపై సీఎంకు కృతజ్ఞతలు

ఈనాడు, హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై సీఎం కేసీఆర్‌కు మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎత్తిపోతల పథకం ఒకటో దశలో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లోని ఏదుల జలాశయం నుంచి అయిదు టీఎంసీల నీటిని ఉమామహేశ్వర జలాశయానికి తరలించి 57,200 ఎకరాలకు సాగునీరు, దారి మధ్యలో ఉండే గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. దీనికోసం రూ.1534.50 కోట్లు మంజూరు చేస్తూ.. ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండో దశ విస్తరణ కూడా ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని