logo

వసతులపై పట్టింపేది?

వివిధ పథకాలు, సేవలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఆర్టీసీ వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. మండల కేంద్రాలు, ఇతర పెద్ద గ్రామాల్లోని బస్టాండ్లలో కనీస వసతులు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది.

Published : 09 Jun 2023 03:53 IST

ప్రాంగణాల్లో నిరుపయోగంగా మరుగుదొడ్లు
తాగునీటికి ఇక్కట్లు

పాలెంలో నిరుపయోగంగా మారిన మరుగుదొడ్లు

బిజినేపల్లి,తెల్కపల్లి, న్యూస్‌టుడే : వివిధ పథకాలు, సేవలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఆర్టీసీ వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. మండల కేంద్రాలు, ఇతర పెద్ద గ్రామాల్లోని బస్టాండ్లలో కనీస వసతులు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. చర్యలు చేపట్టాల్సిన ఆర్టీసీ అధికారులు మాత్రం.. ఆ దిశగా స్పందించడం లేదు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించకపోవడంతో వృద్ధులు, మహిళా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

* వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రయాణికుల రాకపోకల దృష్ట్యా ప్రయాణ ప్రాంగణాల్లోనూ రద్దీ అధికమైంది. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ డిపోల పరిధిలో ఉన్న ప్రయాణ ప్రాంగణాల్లో నియోజకవర్గస్థాయిలో మినహా ఏ ఒక్క ప్రయాణ ప్రాంగణంలోనూ తాగునీటి వసతి లేదు. ప్రయాణికులు బస్టాండ్‌ సమీపంలోని దుకాణాలకు పరుగెత్తి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. రూ.లక్షల  వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. బిజినేపల్లి మండలం పాలెంలో 20 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రయాణ ప్రాంగణంలో మరుగుదొడ్ల వసతి సక్రమంగా లేక వృద్ధులు, మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పాలెంలో వ్యవసాయ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా.. వసతులు కల్పించడంలో అధికారులు చర్యలు చేపట్టడం లేదు. అధికారులు పర్యవేక్షణ లేక  ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారింది. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు ప్రారంభానికి నోచుకోవడం లేదు. తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, కోడేరు, బల్మూరు, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్‌, వీపనగండ్ల, వెల్దండ తదితర మండల కేంద్రాల్లోని ప్రయాణ ప్రాంగణాల్లో తాగునీటి వసతి ఊసేలేదు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ, వసతులు కల్పించడంలో కొంతైనా చూపితే ఇక్కట్లు తీరుతాయని ప్రయాణికులు కోరుతున్నారు.

నివేదికలు పంపించాం..

ప్రయాణ ప్రాంగణాల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించేందుకు అధికారులకు నివేదికలు పంపించాం. పాలెం ప్రయాణ ప్రాంగణం మరమ్మతులకు ఇటీవలే నిధులు మంజూరయ్యాయి. టెండరు ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఏర్పాటుచేస్తాం.

భూక్యా ధరమ్‌సింగ్‌, డిపో మేనేజర్‌ నాగర్‌కర్నూల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు