logo

విద్యార్థుల్లో ప్రేరణ కలిగేలా..

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Updated : 29 Mar 2024 06:37 IST

దరఖాస్తులు చేసే ప్రేరణ వెబ్‌పేజీ

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎంపిక కోసం ఏప్రిల్‌ 1 - 15వ తేదీ నాటికి అన్ని పాఠశాలల్లో 9 - 10వ తరగతుల వారితో పాటు, ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక పోటీలు నిర్వహించనున్నారు. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు: ప్రేరణ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే 9 నుంచి ఇంటర్‌ విద్యార్థులు prerana.education.gov.in అనే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారందరికీ పుస్తకాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా ప్రతి పాఠశాల నుంచి ఒక బాలిక, మరో బాలుడిని ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించాల్సి ఉంటుంది. జోగులాంబ, వనపర్తి, నాగర్‌కర్నూలు, నారాయణపేట జిల్లాల విద్యార్థులకు వట్టెం నవోదయ పాఠశాలలో అయిదు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. మహబూబ్‌నగర్‌ విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయంలో శిక్షణ ఉంటుంది.

గుజరాత్‌లో శిక్షణ: మంచి ప్రతిభ, చురుకుదనం కనబరచిన జిల్లాకు ఇద్దరు చొప్పున విద్యార్థులను జాతీయ స్థాయిలో నిర్వహించే శిక్షణకు ఎంపిక చేస్తారు. గుజరాత్‌ రాష్ట్రంలోని వాద్రాఘర్‌లోని పాఠశాలలో ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు ఉంటాయి. స్వాభిమాన్‌, ధైర్య సాహసాలు, పరిశ్రమలు, కరుణ - సేవ, భిన్నత్వంలో ఏకత్వం, సత్య నిష్ఠ, నిజాయతీ - నాయకత్వం, సాంకేతికత, విశ్వసనీయత, స్వేచ్ఛ - కర్తవ్యం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చి విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు.

ప్రతి పాఠశాలా భాగస్వామి అయ్యేలా..

ప్రేరణ కార్యక్రమంలో ప్రతి పాఠశాలా భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని పాఠశాలల హెచ్‌ఎంలకు ఈ మేరకు సమాచారం ఇచ్చాం.

ఎస్తేర్‌రాణి, విద్యాశాఖ సమన్వయ అధికారి, జోగులాంబ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు