logo

లోక్‌సభలో పనితీరుపై చర్చకు సిద్ధమా..

తాను లోక్‌సభలో ప్రజా సమస్యలపై పెదవి విప్పలేదని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ఆరోపించటంపై మహబూబ్‌నగర్‌ ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

Published : 16 Apr 2024 03:11 IST

వంశీచంద్‌రెడ్డికి భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి సవాల్‌

భారాస కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి

హన్వాడ, న్యూస్‌టుడే : తాను లోక్‌సభలో ప్రజా సమస్యలపై పెదవి విప్పలేదని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ఆరోపించటంపై మహబూబ్‌నగర్‌ ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. 2019 ఎన్నికల నుంచి కనపడని నాయకులు ఎన్నికలు రాగానే ప్రజల్లోకి వచ్చి తప్పుడు హామీలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తన పనితీరు తెలుసుకోవాలంటే పార్లమెంట్‌లో తన హాజరుశాతం తెలుసుకోవాలన్నారు. సోమవారం హన్వాడలో నిర్వహించిన భారాస విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన ఐదేళ్లలో వంశీచంద్‌రెడ్డి ఏం చేశారో.. ఎక్కడ ఉన్నారో.. తాను ఏం చేశానో.. ఎక్కడ ఉన్నానో.. చర్చించేందుకు మహబూబ్‌నగర్‌లోని క్లాక్‌టవర్‌కు రావాలని సవాల్‌ విసిరారు. పార్లమెంట్‌లో సైనిక్‌ పాఠశాల, నిరుద్యోగం, రైల్వే సమస్యలపై ప్రశ్నించానని చెప్పారు. 4వేల మందికి తన కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించానని, కార్యకర్తలు, అభిమానుల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎంపీలు పార్లమెంట్‌కు ఎన్ని రోజులు హాజరయ్యారు.. ఏ సమస్యలను ప్రస్తావించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రితో పాటు అలుపెరగకుండా తిరిగానని ఎంపీ చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ ఎంతో అభివృద్ధి చేశారని, తాగు, సాగునీటి రంగాలను మెరుగుపరిచారని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించిన క్యాంపు కార్యాలాయాల్లో నేడు ఎమ్మెల్యేలు ఉంటున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారని, వారిని ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల, భారాస మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు