logo

హామీలతో కాంగ్రెస్‌ మోసం

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పలు హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండు చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్‌ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

Updated : 16 Apr 2024 05:45 IST

మాజీ మంత్రి హరీశ్‌రావు

కోస్గిలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

కోస్గి, న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పలు హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండు చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్‌ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 13 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు..డిసెంబర్‌ 9న రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా అమలు చేయలేదని అన్నారు. రైతుబంధు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ఇచ్చారా, కౌలు రైతులకు. రైతుకూలీలకు రూ. 15 వేలు అందించారా, 24 గంటల కరెంటు అందిస్తున్నారా? అని కార్యకర్తలను అడిగారు. అవ్వ, తాతలకు రూ. 4 వేలు పింఛను రాలేదని, పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు రూ. 2500 రాలేదని, ఆడపిల్లలకు స్కూటీ, తులం బంగారం ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రూ.4వేల భృతి ఇస్తామని నిరుద్యోగులను రేవంత్‌ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌ హామీలపై ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. కేంద్రంలో భాజాపా ప్రభుత్వం ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించలేదని అన్నారు. కర్వెన వరకు జలాశయం పూర్తయ్యిందని, అక్కడి నుంచి కొడంగల్‌ వరకు కాలువలు తవ్వితే కొడంగల్‌లో 1.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, ఎర్సన్‌పల్లి గ్రామస్థుల పొలాలను ఫార్మాసిటీ పేరుతో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, ఆ రైతులకు భారాస అండగా నిలుస్తుందన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో భారాస కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు.


రాష్ట్రం తెచ్చింది, కాపాడుకునేది మనమే: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ తెచ్చినది మన పార్టీయేనని, రాష్ట్రాన్ని కాపాడుకునేది మనమేనని అన్నారు. భవిష్యత్తు భారాసదేనని, మళ్లీ  కేసీఆర్‌ సీఎం అవుతారని అన్నారు. కేసీఆర్‌ హయాంలో ఒక్క ఎకరం ఎండిపోలేదని, ఇప్పుడు రైతు, కూలీలు ముంబయికి వలస పోవాల్సి వస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో భారాస ఎంపీని గెలిపిస్తే తెలంగాణ గొంతు పార్లమెంట్‌లో వినిపించే అవకాశం కలుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్‌ వాళ్లు ఆయనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. ఓడిపోతున్నామని తెలిసే అలా మాట్లాడుతున్నారన్నారు..తన హయాంలో కొడంగల్‌లో రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధి చేశామని, ఇప్పుడు 50 వేల మెజార్టీ ఇస్తేనే అభివృద్ధి చేస్తామని మెలిక పెడుతున్నారని విమర్శించారు. అధికారులు భారాస కార్యకర్తల బిల్లులు ఇవ్వడంలేదని, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య, చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని