logo

చిన్నబోతున్న.. కోడి గుడ్డు..!

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడి గుడ్ల్లు చాలా చిన్నవిగా ఉంటున్నాయి. అదేమిటని కేంద్రాల ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే మాకేం తెలుసు సరఫరా చేసే వారినే అడగండని అంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే గుడ్డు పరిమాణం ప్రధానం కాదు ఒక ట్రే

Published : 27 Jan 2022 01:43 IST

అంగన్‌వాడీ కేంద్రాలకు తక్కువ పరిమాణంలో ఉన్నవి సరఫరా
న్యూస్‌టుడే, నర్సాపూర్‌

నర్సాపూర్‌ కేంద్రంలో చిన్నారులు

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడి గుడ్ల్లు చాలా చిన్నవిగా ఉంటున్నాయి. అదేమిటని కేంద్రాల ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే మాకేం తెలుసు సరఫరా చేసే వారినే అడగండని అంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే గుడ్డు పరిమాణం ప్రధానం కాదు ఒక ట్రే బరువు కిలోన్నర ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. ఒక్కో గుడ్డును తూకం వేయలేం కదా అని వాదిస్తున్నారు. ఇలాగైతే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఎలా సరిపోతుందనేది అధికారులకే తెలియాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధి అంగన్‌వాడీ కేంద్రాల్లో నిబంధనల మేరకు కాకుండా తక్కువ పరిమాణంతో ఉన్నవి సరఫరా చేస్తున్న తీరుపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

సరఫరా చేసిన గుడ్లు ఇలా..

ఆరు మండలాల్లో..
ప్రాజెక్టు పరిధిలో నర్సాపూర్‌, శివ్వంపేట, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలు ఉన్నాయి. వీటిలో 11 సెక్టార్లు, 208 ప్రధాన, 80 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 3-6 ఏళ్లలోపు చిన్నారులు 5,661, గర్భిణులు 1,589, బాలింతలు 1,419 మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఒక్క నర్సాపూర్‌ పట్టణంలోనే 12 ప్రధాన, 2 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. నిబంధనల ప్రకారం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు 50 గ్రాముల గుడ్డు రోజూ ఇవ్వాలి. వారంలో మొదటి రోజు, నాలుగో రోజు గుడ్డు కూర, మిగతా అన్ని రోజులు ఉడకబెట్టింది ఇవ్వాలి. బుధవారం మాత్రం అందరికీ రెండు గుడ్లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో అధిక పోషకాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ గుడ్లు తినాలని సూచిస్తున్న అధికారులు చిన్న పరిమాణం గల గుడ్లు సరఫరా చేస్తే ఎలా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. చాలా చోట్ల గుడ్డు బరువు 40 గ్రాములు లేదా అంతకంటే తక్కువే ఉంటోంది. ప్రాజెక్టు పరిధిలో సింహభాగం అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న గుడ్లే సరఫరా అవుతున్నాయి. నర్సాపూర్‌లోని పలు కేంద్రాల్లో పరిశీలిస్తే చిన్న సైజులో ఉన్నవి దర్శనమిచ్చాయి. ప్రాజెక్టు కార్యాలయం పక్కన, కాగజ్‌మద్దూర్‌ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


వెంటనే తిరస్కరిస్తున్నాం..
- హేమాభార్గవి, సీడీపీవో, నర్సాపూర్‌

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడి గుడ్లు నిర్ణీత పరిమాణంలో లేకుంటే వెంటనే తిప్పి పంపుతున్నాం. గతంలో రెండు మూడు సార్లు ఇలాగే చేశాం. కేంద్రాల ఉపాధ్యాయులకు సైతం వాటిని తీసుకోకుండా తిప్పి పంపించాలని సూచించాం. గుడ్డు పరిమాణం ప్రధానం కాదు, ట్రే బరువు కిలోన్నర ఉంటే చాలు. గుత్తేదారుకు సైతం సమాచారం అందించి తీరు మార్చుకోమని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించాం.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని