logo

సగం మందీ గట్టెక్కలే!

జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 50 శాతం లోపు ఉండటం గమనార్హం. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో న్యాల్‌కల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో

Published : 30 Jun 2022 01:51 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఫలితాలు నిరాశాజనకం

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 50 శాతం లోపు ఉండటం గమనార్హం. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో న్యాల్‌కల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 10.32శాతమే పాసయ్యారు. హద్నూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోనూ ఇదే తీరు. ఇక్కడ ఉత్తీర్ణత శాతం 15.96. కోహీర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 277కు 86 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 11 కళాశాలల్లో ఉత్తీర్ణత 50శాతం లోపు ఉంది.

ఇదీ పరిస్థితి..: 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు జిల్లాలో ఉన్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షకు 3,696 మంది హాజరుకాగా సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 1,248 మంది విద్యార్థులు మాత్రమే గట్టెక్కారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన 2,867 మందిలో 1,373 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 45.41శాతమే ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. పరీక్షకు 218 మంది హాజరుకాగా 99 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 189 మందికి 113 మంది ఉత్తీర్ణత సాధించారు. సంగారెడ్డిలోని బాలికల జూనియర్‌ కళాశాలలో ఉత్తీర్ణత 60.75శాతం ఉండగా బాలుర కళాశాలలో ఇది 32.61 శాతమే.

ఇక్కడ ఆదర్శం: సమస్యలు తిష్ట వేసినా కొన్ని కళాశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతంతో ఆదర్శాన్ని చాటాయి. ప్రణాళికతో ముందుకు సాగడమే దీనికి కారణం. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక తరగతులు, వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. కల్హెర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 103 మందికి 90 మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. కంగ్టి కళాశాలలో 109 మందికి 90, హత్నూరలో 69కి 54 మంది గట్టెక్కారు.


మెరుగవ్వాలంటే..

* అధ్యాపకుల ఖాళీలను భర్తీచేయాలి.

* కళాశాలల్లో కనీస వసతులు కల్పించాలి.

* విద్యార్థులు చదువుపై దృష్టిసారించేందుకు వీలుగా ఆహ్లాదకర వాతావరణం ఉండాలి.

* కళాశాల నిర్వహణపై సరైన పర్యవేక్షణ ఉండటంలేదు. అధికారుల పర్యవేక్షణ పెరగాలి.

* విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక తరగతులతోపాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలి.


కారణాలు తెలుసుకుంటాం
-గోవిందరామ్‌, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి

విద్యార్థుల ఉత్తీర్ణత తక్కువగా వచ్చిన కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలు తెలుసుకుంటాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఫలితాల మెరుగుకు ప్రణాళికతో ముందుకు సాగుతాం. ప్రత్యేక తరగతులతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని