logo

ప్రభుత్వ బడులు.. ప్రవేశాలు భళా

ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. గత నెల బడిబాట కార్యక్రమం నిర్వహించడం, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం మంచి ఫలితాలు ఇచ్చింది. మన ఊరు- మన బడి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, 1 నుంచి 8 తరగతుల్లో

Published : 05 Jul 2022 01:48 IST

ఇప్పటి వరకు చేరింది 10,192 విద్యార్థులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

ఇంటింటి ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతోంది. గత నెల బడిబాట కార్యక్రమం నిర్వహించడం, ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం మంచి ఫలితాలు ఇచ్చింది. మన ఊరు- మన బడి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, 1 నుంచి 8 తరగతుల్లో ఆంగ్ల మాధ]్యమం ప్రవేశపెట్టడంతో ప్రవేశాలు పెరిగినట్లు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పాఠశాలలకు ఇప్పటి వరకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు రాలేదు. ఇవి వస్తే ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం..

జిల్లాలో 1,248 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. జూన్‌ 3 నుంచి ప్రారంభమైన ప్రవేశాల ప్రక్రియలో ఇప్పటి వరకు ప్రభుత్వ బడుల్లో అన్ని తరగతులకు కలిపి 10,192 మంది విద్యార్థులు చేరారు. వీటిలో ఎక్కువగా 1, 6, 8 తరగతుల్లో విద్యార్థులు చేరారు. ఈ మూడు తరగతుల్లో 7,111 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి కూడా వచ్చి చేరుతున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో 3,067 మంది వివిధ తరగతుల్లో ప్రైవేట్‌ పాఠశాలల నుంచి వచ్చారు. ఇప్పటికీ ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగడంతో సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌లో రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. చెల్లించలేని వారు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలో 72 మంది చేరారు. ప్రైవేట్‌ నుంచి వచ్చిన వారిలో  32 మంది ఉన్నారు. ఒక్క సంగారెడ్డే కాకుండా జహీరాబాద్‌, సదాశివపేట, పటాన్‌చెరు, రామచంద్రాపురం, జోగిపేటల్లో ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు: ప్రభుత్వ బడులను కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు ముందుకు వస్తున్నారు. రేషనలైజేషన్‌తో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే మూత పడే అవకాశాలు ఉండడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి తమ పాఠశాలల్లో చేర్పించాలని చెబుతున్నారు. అంగన్‌వాడీలలో చదివే విద్యార్థులను 1వ తరగతిలో ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లోని విద్యార్థులు కూడా ఉన్నత పాఠశాలల్లో చేరేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇలా నేరుగా ఉపాధ్యాయులే ముందుకు రావడంతో తల్లిదండ్రుల్లో నమ్మకం కలుగుతోంది.


తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తున్నాం

రాజేశ్‌, జిల్లా విద్యాధికారి

ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫాం ఉచితంగా అందిస్తున్నాం. 8వ తరగతి చదివే వారికి ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో సీటు దక్కించుకోవచ్చు. ఇలాంటి సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని