logo

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

తంగేడు పూలు కోసుకు రావడానికి వెళ్లిన యువకుడు.. చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో పలుసార్లు యువకుడు మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తించేవాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం శివారులో చోటుచేసుకుంది.

Published : 05 Oct 2022 00:59 IST

న్యూస్‌టుడే, కొండపాక: తంగేడు పూలు కోసుకు రావడానికి వెళ్లిన యువకుడు.. చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో పలుసార్లు యువకుడు మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తించేవాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం శివారులో చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్‌ఐ పుష్పరాజ్‌, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు.. తిప్పారం గ్రామానికి చెందిన గడ్డం కొమురయ్య, నాగలక్ష్మి కుటుంబం తుర్కపల్లిలోని కోళ్లఫారంలో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి నరేశ్‌, ప్రశాంత్‌ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నరేశ్‌(22) టీవీ మరమ్మతులు చేసేవాడు. అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తించేవాడు. సద్దుల బతుకమ్మ, దసరా పండగలు చేసుకునేందుకు సోమవారం వారంతా తిప్పారం చేరుకున్నారు. ఆరోజు ఉదయం 6 గంటలకు బతుకమ్మ పేర్చడానికి తంగేడు పూలు తెస్తానని నరేశ్‌ వెళ్లాడు. ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం తిప్పారం శివారులోని పొలంలో చింత చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. పర్వదినాల్లో ఈ విషాదకర సంఘటన గ్రామస్థులను ఆవేదనలో ముంచెత్తింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


చేపల వేటకు వెళ్లి ఇద్దరి మృతి

హవేలిఘనపూర్‌, న్యూస్‌టుడే: చేపల వేటలకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన ఘటనలు హవేలిఘనపూర్‌ మండలంలో చోటుచేసుకున్నాయి. స్థానిక ఎస్‌ఐ మురళి తెలిపిన వివరాలు.. మండలంలోని స్కూల్‌ తండాకు చెందిన నేనావత్‌ అరుణ, లాల్య (32) దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. లాల్య కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లాల్య సోమవారం రాత్రి తండాకు సమీపంలోని హవేలిఘనపూర్‌ చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన లాల్య ప్రమాదవశాత్తు నీటి మునిగి ఊపిరాడక మృతి చెందాడు. మంగళవారం ఉదయమైనా భర్త ఇంటికి రాకపోవడంతో అరుణ.. చెరువు వద్దకు వెళ్లి వెతకగా చెరువు గట్టు మీద లాల్య చెప్పులు, దుస్తులు కనిపించాయి. దీంతో ఈతగాళ్ల సాయంతో గాలించగా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


వలలో చిక్కుకొని..

హవేలిఘనపూర్‌ మండల పరిధి గాజిరెడ్డిపల్లికి చెందిన ఉప్పలపు సత్తయ్య (55), సత్తమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. సత్తయ్య.. ముగ్గురితో కలిసి గ్రామానికి సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల కోసం చెరువులో వల వేసి వస్తుండగా ప్రమాదవశాత్తు సత్తయ్య కాళ్లు అందులో చిక్కుకున్నాయి. దీంతో నీటిలో మునిగాడు. గమనించిన దాసు, లక్ష్మీపతి, మంగయ్యలు సత్తయ్యను బయటకు తీసి చూసే సరికి సత్తయ్య మృతిచెందాడు. మృతుడి భార్య సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


కడుపునొప్పితో రైతు..

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: కడపునొప్పి భరించలేక ఆత్మహత్యకు యత్నించిన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని మెట్టుపల్లిలో  చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివానందం తెలిపిన వివరాలు.. మెట్టుపల్లికి చెందిన ధర్మాజిపేట తిరుపతిరెడ్డి(34) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య జ్యోతి, కుమారుడు రేవంత్‌రెడ్డి, కూతురు మానస ఉన్నారు. తిరుపతిరెడ్డి గత మూడేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. మనస్తాపానికి గురై తన ఇంట్లో శనివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. తండ్రి సత్తిరెడ్డి గమనించి, గ్రామస్థుల సాయంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


జీవితంపై విరక్తితో... బలవన్మరణం

ఝరాసంగం: కొన్నేళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తి చెంది తాగునీటి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఝరాసంగం ఎస్సై రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం... కొన్నాళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న చీల్కేపల్లి గ్రామానికి చెందిన మంగలి మైపాల్‌(35) చికిత్స చేయించుకున్నా తగ్గడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తాగునీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య ప్రేమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మైపాల్‌కు పదేళ్లలోపు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని