logo

సహజ ప్రసవానికే ప్రాధాన్యం

తూప్రాన్‌కు చెందిన ఓ గర్భిణి రెండో కాన్పు నిమిత్తం మెదక్‌లోని మాతాశిశు సంరక్షణ కేంద్రాని(ఎంసీహెచ్‌)కి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యబృందం ప్రసవం చేయగా పాపకు జన్మనిచ్చారు.

Published : 30 Jan 2023 02:56 IST

కేంద్రంలో బాలింతలు

న్యూస్‌టుడే, మెదక్: తూప్రాన్‌కు చెందిన ఓ గర్భిణి రెండో కాన్పు నిమిత్తం మెదక్‌లోని మాతాశిశు సంరక్షణ కేంద్రాని(ఎంసీహెచ్‌)కి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యబృందం ప్రసవం చేయగా పాపకు జన్మనిచ్చారు. ఆ సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కాగా వైద్యులు గర్భ సంచి తొలగించారు. పరిస్థితి విషమించడంతో గాంధీకి పంపించగా రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడారు. సదరు మహిళ మరోసారి ఎంసీహెచ్‌కు వచ్చి వైద్యసిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

* మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఈనెల 11న 24 గంటల్లో 25 ప్రసవాలు జరిగాయి. ఇందులో 12 సాధారణ, మిగతావి సిజేరియన్‌ ప్రసవాలు. ఇది వరకు ఆసుపత్రిలో 23 ప్రసవాలు జరుగగా, ఆ రికార్డును తిరగరాశారు. కార్పోరేట్‌ స్థాయిలో వసతులు, కేసీఆర్‌ కిట్‌ అమలు, వైద్యానికి ఇంటి నుంచి ఆసుపత్రి వరకు వాహన సౌకర్యం కల్పించడం.. పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైపు గర్భిణులు మొగ్గుచూపుతున్నారు. గతంలో అసౌకర్యాల మధ్య ప్రసవాలు జరగ్గా, ఇప్పుడు అధునాతన వసతులు అందుబాటులోకి రావడంతో వచ్చే వారికి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో సహజ కాన్పులపై దృష్టిపెడుతున్నారు.

అధునాతన సౌకర్యాలు

జిల్లా కేంద్రం మెదక్‌లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఇది వరకు ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనంలో కొనసాగేది. గతేడాది మే నెలలో రూ.17 కోట్లతో స్థానిక పిల్లికొట్టాల వద్ద అధునాతన భవనం అందుబాటులో రాగా, అక్కడికి మార్చారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఇక్కడ సహజ కాన్పులు జరిగేలా వైద్యులు దృష్టిసారించారు. గర్భిణిగా పేరు నమోదైనప్పటి నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో చికిత్స పొందుతుండగా, ఆరు నెలల తర్వాత ఎంసీహెచ్‌కు వచ్చి సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు వాకబు చేస్తున్నారు. రక్తహీనత, రక్తపోటు ఉంటే చికిత్స అందిస్తున్నారు. ఒక వేళ కుటుంబీకులు శస్త్రచికిత్స చేయాలని కోరినా.. సహజ కాన్పుపై అవగాహన కల్పిస్తున్నారు.


ఆరు నెలల తర్వాత..

శివదయాళ్‌, సివిల్‌ సర్జన్‌, ఎంసీహెచ్‌

గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రసవాలు జరిగేలా దృష్టి సారించాం. ఆరు నెలలుగా ఉన్న సమయం నుంచి వచ్చే వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధవహిస్తున్నాం. వారికేమైనా సమస్యలుంటే సమయం సమీపించే నాటికి తొలగిపోయేలా చర్యలు తీసుకుంటున్నాం. కాన్పు సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే తగిన చికిత్సతో తల్లి, బిడ్డల ప్రాణాలు కాపాడుతున్నాం. ఎంసీహెచ్‌లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటం కలిసొచ్చింది.


అందుబాటులో వైద్యులు

పరీక్షిస్తున్న వైద్యులు

మాతా శిశుసంరక్షణ కేంద్రం అందుబాటులోకి రావడంతో వైద్యసేవలు మెరుగయ్యాయి. మెదక్‌ సమీపంలోని మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, గోపాల్‌పేట, మేడ్చల్‌ జిల్లాల నుంచి గర్భిణులు ఇక్కడికి వస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయి. గత జులై నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది జులైలో 308, ఆగస్టులో 338, సెప్టెంబరులో 377, అక్టోబరులో 384, నవంబరులో 407, డిసెంబరులో 376 వరకు జరిగాయి. ఈ ఏడాది జనవరి 27 వరకు 310 వరకు జరగ్గా, ఇందులో 166 సాధారణమైనవే కావడం గమనార్హం. నిత్యం ఇక్కడ 15 వరకు చేస్తున్నారు. ఒక సివిల్‌ సర్జన్‌తో పాటు మరో ముగ్గురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ఇద్దరు అనస్తీషియా వైద్యులు ఉన్నారు. ఇద్దరు చిన్నపిల్లల వైద్యులు సేవలందిస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని