logo

అమ్మకు కష్టమొచ్చింది.. ఆపద తలపెట్టింది

అమ్మ తీసుకెళ్తుంటే పొలాల్లో ఆడుకోవడానికి అనుకున్నారా పిల్లలు. బావి ఒడ్డున నిలబెట్టి చూపుతుంటే నీళ్ల లోతు గురించి చెబుతోందని భావించారు.

Published : 09 Feb 2023 01:59 IST

కుమార్తె, కుమారుడితో కలిసి బావిలోకి దూకిన తల్లి
ఇద్దరి మృత్యువాత.. ముళ్లపొద పట్టుకుని బయటపడిన తనయుడు

పుణ్యమ్మ  సంగీత

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌ అర్బన్‌), న్యూస్‌టుడే: అమ్మ తీసుకెళ్తుంటే పొలాల్లో ఆడుకోవడానికి అనుకున్నారా పిల్లలు. బావి ఒడ్డున నిలబెట్టి చూపుతుంటే నీళ్ల లోతు గురించి చెబుతోందని భావించారు. కానీ అమ్మకొచ్చిన కష్టంతో ప్రాణాలు తీసుకునేందుకు తమను వెంట తీసుకొచ్చిందని పసిగట్టలేక పోయారు. ‘తాను లేని లోకంలో తన బిడ్డలు బాధలు పడకూడదని’ భావించిన ఆ తల్లి కుమార్తె, కుమారుడితో కలిసి బావిలోకి దూకేందుకు సిద్ధమైంది. అంచులో నిలబడి దూకడానికి యత్నిస్తుండగా కుమారుడు ఒడ్డున ఉన్న ముళ్లచెట్టును పట్టుకోవడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం రాంతీర్థ్‌లో చోటుచేసుకుంది. హద్నూర్‌ ఎస్సై వినయ్‌కుమార్‌, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంతీర్థ్‌ గ్రామానికి చెందిన తెనుగు మల్లేశం, పుణ్యమ్మ(36) దంపతులకు కుమార్తె సంగీత(9), రాము(7) సంతానం. మానసికస్థితి సరిగాలేని మల్లేశం భార్యతో తరచూ గొడవలు పడేవాడు. ఇటీవల మద్యానికి బానిసై రోజూ వివాదానికి దిగుతున్నాడు. పుణ్యమ్మ బుధవారం సాయంత్రం పిల్లలతో కలిసి పొలిమేరలోని వ్యవసాయ బావిలో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది. దూకే క్రమంలో రాము ముళ్లపొదను పట్టుకున్నాడు. పుణ్యమ్మ, సంగీత నీళ్లలో పడిపోయారు. చిన్నారి వెంటనే ఊళ్లోకి వెళ్లి గ్రామస్థులకు చెప్పాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జహీరాబాద్‌ అగ్నిమాక శకటాన్ని రప్పించి నిచ్చెన, ఈతగాళ్ల సాయంతో తల్లీకూతుళ్ల మృతదేహాలను వెలికితీయించి జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆవేదనాభరితంగా రాము


గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్‌ మృతి

తాండూరు, బషీరాబాద్‌, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ కండక్టర్‌ గుండెపోటుకు గురై మృతి చెందాడు. బషీరాబాద్‌- ఇందర్‌చేడ్‌ మార్గంలో ఈ ఘటన జరిగింది. తాండూరు డిపో మేనేజరు సమత తెలిపిన ప్రకారం సంగెం కలాన్‌ గ్రామానికి చెందిన సంతోష్‌ కుమార్‌ (38) బుధవారం విధులకు వచ్చారు. అదేరోజు రాత్రి బషీరాబాద్‌ నుంచి ఇందర్‌చేడ్‌ గ్రామానికి వెళ్లేందుకు ప్రయాణికులకు టిక్కెట్లను ఇచ్చారు. పని పూర్తవడంతో డ్రైవర్‌తో మాట్లాడుతూనే ఉన్నట్టుండి గుండెపోటుకు గురై కింద పడిపోయారు. అదే బస్సులో అతడిని బషీరాబాద్‌, తాండూరు ఆసుపత్రులకు తరలించారు. అప్పటికే కండక్టర్‌ మృతి చెందాడని వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.


ఆర్థిక ఇబ్బందులతో రైతు బలవన్మరణం

పూడూరు, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరుకు చెందిన జీవరత్నం(57) రైతు. ఆయనకు ఐదు ఎకరాల్లో మామిడి తోట ఉంది. తోట సంరక్షణకు ఇటీవల బ్యాంకుతోపాటు, ప్రైవేటుగా రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. చేసేది లేక.. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టణంలోని పిడిచేటు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. గజ్వేల్‌ ఠాణా సీఐ వీరప్రసాద్‌ తెలిపిన వివరాలు.. రాయపోల్‌ మండలం మంతూరుకు చెందిన తంగెళ్లపల్లి మురళీదాస్‌(22), నవీన్‌, భానుప్రసాద్‌ ద్విచక్రవాహనంపై గజ్వేల్‌కు వచ్చారు. బుధవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. పట్టణంలోని పిడిచేడు రోడ్డులో ముందు వెళుతున్న లారీ డ్రైవరు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో ద్విచ్రవాహనం దాన్ని ఢీకొంది. ప్రమాదంలో తంగెళ్లపల్లి మురళీదాస్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

కంటెయినర్‌ ఢీకొని ఒకరు..

కోహీర్‌, న్యూస్‌టుడే: కంటెయినర్‌ ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా.. మరొకరికి గాయాలైన ఘటన మండలంలోని దిగ్వాల్‌లో చోటుచేసుకుంది. ఎస్సై వి.సురేష్‌ తెలిపిన వివరాలు.. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం కొత్తకోలుకుందకు చెందిన అర్షద్‌, జహీర్‌ స్నేహితులు. బుధవారం వీరిద్దరు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడెకన్నలో వివాహ వేడుకకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. 65వ నంబరు జాతీయ రహదారిపై దిగ్వాల్‌కు చేరుకోగానే ప్రధాన కూడలి వద్ద సంగారెడ్డి వైపు నుంచి జహీరాబాద్‌ వైపు వెళ్తున్న కంటెయినర్‌ ఢీకొంది. ఇరువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఇద్దరిని జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్షద్‌(23) ప్రాణాలు విడిచాడు. మృతుని తండ్రి నిజాముద్దీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


టీ తాగేందుకు రోడ్డు దాటుతూ మరొకరు..

శామీర్‌పేట, న్యూస్‌టుడే: కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట ఠాణా పరిధిలో బుధవారం జరిగింది. ఎస్సై మునీందర్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పెద్ద రమేశ్‌(52) వంట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గిరాకీ నిమిత్తం నగరానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి హెచ్‌పీ పెట్రోల్‌బంకు వద్ద చాయ్‌ తాగేందుకు ఆగారు. రాజీవ్‌ రహదారి దాటుతుండగా.. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపునకు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలొదిలారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ‘గాంధీ’కి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని