logo

నర్సాపూర్‌ ఖరారు.. మెదక్‌ తకరారు

ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల మాత్రమే గడువు ఉంది. షెడ్యుల్‌ వెలువడ్డాక రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. భాజపా నుంచి నర్సాపూర్‌ అభ్యర్థిని ప్రకటించగా, మెదక్‌ స్థానం పెండింగ్‌లో ఉంచారు.

Published : 23 Oct 2023 01:47 IST

న్యూస్‌టుడే, నర్సాపూర్‌, మెదక్‌

ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల మాత్రమే గడువు ఉంది. షెడ్యుల్‌ వెలువడ్డాక రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. భాజపా నుంచి నర్సాపూర్‌ అభ్యర్థిని ప్రకటించగా, మెదక్‌ స్థానం పెండింగ్‌లో ఉంచారు.

కండక్టర్‌ నుంచి ప్రస్థానం ప్రారంభం

నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్సాపూర్‌ పుర అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌యాదవ్‌ను ఖరారు చేశారు. ఇక్కడి నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి, అసెంబ్లీ కన్వీనర్‌ వాల్దాస్‌ మల్లేశ్‌గౌడ్‌, రాష్ట్ర నాయకుడు రఘువీరారెడ్డిలు టికెట్‌ ఆశించారు. వీరిలో మురళీయాదవ్‌కే అవకాశం దక్కింది. ఈయన 1985-1995 వరకు ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేశారు. ఈ సమయంలో సీపీఐ ఎమ్మెల్యే చిలుముల విఠల్‌రెడ్డి నర్సాపూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. 1995-2000 వరకు ఆ పదవిలో కొనసాగారు. అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రెండోసారి 2000-2005 వరకు సర్పంచిగా ఉన్నారు. 2014-2019 వరకు భారాస ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మురళీయాదవ్‌ కొనసాగారు. 2020లో నర్సాపూర్‌ పుర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2022 ఆగస్టులో భారాస అధిష్ఠానంపై అసమ్మమతి స్వరం వినిపించడంతో సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత భాజపాలో చేరారు. ఈటల రాజేందర్‌కు అనుచరుడిగా కొనసాగుతుండగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి పదవి దక్కింది. బీసీ గళం బలంగా వినిపించడంతో పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించింది.

మెదక్‌లో నలుగురి మధ్య పోటీ..

మెదక్‌ అభ్యర్థితత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు. పలువురు దరఖాస్తు చేసుకోగా అందులో నలుగురిని పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు పరిణిత, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్‌రెడ్డి, నిజాంపేట జడ్పీటీసీ సభ్యుడు పంజా విజయ్‌ కుమార్‌లలో ఒకరికి టిక్కెట్‌ దక్కే అవకాశాలు ఉన్నాయి. మహిళ, బీసీ, రెడ్డి సామాజికవర్గం కోటాలో వీరి పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి మెదక్‌ ఎంపీగా పనిచేసిన అనుభవం, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఆమెను మరోసారి బరిలో దింపాలని అధిష్ఠానం యోచిస్తోంది. రెండో జాబితాలో అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది.

వల్లూరులో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైపే మొగ్గు

చేగుంట: దుబ్బాక భాజపా అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. టికెట్‌కు పలువురు దరఖాస్తు చేయగా, అధిష్ఠానం మాత్రం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపింది. ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. 2014, 2018లో దుబ్బాక నుంచి, 2019లో మెదక్‌ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. భారాస కంచుకోట.. భాజపాలోకి వెళ్లింది.

అవకాశమిస్తే ఆదర్శంగా: రఘునందన్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే, భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం నార్సింగి మండలం వల్లూరులో భాజపా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పలువురు భారాస కార్యకర్తలు భాజపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేళ్లు ఎంపీగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకకు చేసింది ఏమిటని ప్రశ్నించారు. మరో ఐదేళ్లు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. చేగుంట వైస్‌ ఎంపీపీ మున్నూరు చంద్రం, భాజపా నార్సింగి పట్టణ అధ్యక్షుడు శిర్న చంద్రశేఖËర్‌, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌, బాల్‌రెడ్డి, నర్సింలు, చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు చింతాల భూపాల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని