logo

మూడో జాబితాలో ముగ్గురు!

శాసనసభ అభ్యర్థుల మూడో జాబితాను భాజపా అధిష్ఠానం గురువారం విడుదల చేసింది. అందోలు నుంచి మాజీ మంత్రి పి.బాబూమోహన్‌, నారాయణఖేడ్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జహీరాబాద్‌లో రాంచందర్‌ రాజనర్సింహ పేర్లను ప్రకటించారు.

Published : 03 Nov 2023 02:35 IST

భాజపా అభ్యర్థుల ఖరారు
సంగారెడ్డిపై తకరారు

శాసనసభ అభ్యర్థుల మూడో జాబితాను భాజపా అధిష్ఠానం గురువారం విడుదల చేసింది. అందోలు నుంచి మాజీ మంత్రి పి.బాబూమోహన్‌, నారాయణఖేడ్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, జహీరాబాద్‌లో రాంచందర్‌ రాజనర్సింహ పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో పటాన్‌చెరు అభ్యర్థిగా నందీశ్వర్‌గౌడ్‌ను ఖరారు చేసిన విషయం విదితమే. సంగారెడ్డిలో టికెట్‌ ఆశావహుల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో టికెట్‌ కేటాయింపును వాయిదా వేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, జోగిపేట.


అందోలు బరిలో బాబూమోహన్‌

భాజపా ప్రకటించిన తొలి జాబితాలో అందోలు ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి మాజీ మంత్రి, సినీ నటుడు పల్లి బాబూమోహన్‌కు చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో భాజపా వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. మూడో జాబితాలో ఆయనకు టికెట్‌ ఖరారయింది. జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు బాలయ్య, భాజపా దళిత మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి కె.జగన్‌ అందోలు స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. చివరికి బాబూమోహన్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి అందోలు నియోజకవర్గం నుంచి బాబూమోహన్‌ తెదేపా తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ గెలుపొందారు. తెదేపా ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. 2004, 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో భారాస(తెరాస)లో చేరి.. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018లో భారాస టికెట్‌ దక్కకపోవడంతో భాజపా చేరి బరిలో నిలిచారు. భారాస అభ్యర్థి క్రాంతికిరణ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.


జహీరాబాద్‌: రాంచందర్‌కు అవకాశం

జహీరాబాద్‌ భాజపా అభ్యర్థిగా రాంచందర్‌ రాజనర్సింహ పేరును భాజపా ప్రకటించింది. ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సోదరుడు. ఈ ఏడాది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆరు నెలల క్రితం కాంగ్రెస్‌లో నుంచి భాజపాలో చేరారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. భాజపా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. భారాస టికెట్‌ దక్కకపోవడంతో ఆ పార్టీ నుంచి భాజపాలోకి చేరిన సామాజిక ఉద్యమకారుడు దిల్లీ వసంత్‌, భాజపా జిల్లా అధికార ప్రతినిధి సుధీర్‌కుమార్‌ జహీరాబాద్‌ నుంచి పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి రాంచందర్‌కు అవకాశం దక్కింది. గత ఎన్నికల్లో ఇక్కడ భాజపా తరఫున పోటీ చేసిన జంగం గోపి బీఎస్పీలో చేరారు.


ఖేడ్‌ నుంచి జన్‌వాడే సంగప్ప

నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా జన్‌వాడే సంగప్పను ఆ పార్టీ ఖరారు చేసింది. పార్టీ అభ్యర్థిత్వం కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి విజయపాల్‌రెడ్డి, పార్టీ జహీరాబాద్‌ పార్లమెంటరీ ఇన్‌ఛార్జి రవికుమార్‌గౌడ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి జన్‌వాడే సంగప్ప మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సంగప్పను భాజపా అధిష్ఠానం ఎంపిక చేసి ప్రకటించింది. కంగ్టి మండలం చౌకన్‌పల్లికి చెందిన సంగప్ప లింగాయత్‌(బీసీ) సామాజికవర్గానికి చెందినవారు. కొంతకాలం పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. 2021 జనవరి 1న అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో భాజపాలో చేరారు. ఖేడ్‌ టికెట్‌ ఆశిస్తూ ఏడాదిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

సంగారెడ్డిలో ఉత్కంఠ

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజకవర్గ టికెట్‌ భాజపా ఇంకా ఖరారు చేయలేదు. ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, ఇటీవల భారాస నుంచి చేరిన పులిమామిడి రాజు, న్యాయవాది కె.దయాకర్‌రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. టికెట్‌ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని