logo

పక్కాగా నిఘా

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు

Published : 20 Apr 2024 02:10 IST

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను బిగించారు. వాటిని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (కలెక్టర్‌) కార్యాలయానికి అనుసంధానం చేశారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బృందం నిరంతరం స్క్రీన్‌పై తనిఖీ దృశ్యాలను వీక్షిస్తుండటం గమనార్హం.

- న్యూస్‌టుడే, నర్సాపూర్‌


 నామపత్రాల్లో ఏముంటాయంటే..

లోక్‌సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. మెదక్‌లో మెదక్‌, సంగారెడ్డిలో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నామినేషన్‌లో భాగంగా అభ్యర్థులు పలు రకాల పత్రాలు రిటర్నింగ్‌ అధికారులకు సమర్పిస్తుంటారు. ఫాం-2ఏ ద్వారా నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆయా పత్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఉచితంగా అందిస్తుంది. సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని సహాయ రిటర్నింగ్‌ అధికారి లేదంటే తహసీల్‌ కార్యాలయాల్లో ఇవి లభిస్తాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. వివరాలు పూరించడంలో సందేహాల నివృత్తికి సహాయక డెస్కులను సంప్రదించవచ్చు.
పార్టీ తరఫున: ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఫాం-ఏతో పాటు ఫాం-బీ అందించాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్షుడి సంతకంతో కూడిన ఆయా ఫాంలను అధికారులకు సమర్పించాలి. అప్పుడే సదరు పార్టీ అభ్యర్థిగా పరిగణిస్తారు.

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల అందరి వివరాలను ఫాం-ఏ ద్వారా తెలియజేస్తాయి. వీటిపై అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి సంతకంతో పాటు ముద్ర ఉంటుంది. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఇందులో పొందుపరుస్తారు.     

తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్నది వీరే అని పార్టీ ప్రతినిది ఇచ్చేదే బీ-ఫాం. నామినేషన్‌ సమయంలో అందించాలి. నామినేషన్ల చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దీన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారానే పార్టీ గుర్తును కేటాయిస్తారు.

సమగ్ర వివరాలు..: నామినేషన్‌ దాఖలుతో పాటు ఫాం-35 (అఫిడవిట్‌) సైతం అభ్యర్థులు విధిగా సమర్పించాలి. తమతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులు, క్రిమినల్‌ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్చిందే.
- న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని