icon icon icon
icon icon icon

PM Modi: తెలంగాణలో డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌తో దేశం సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ

భారత్‌ను కాంగ్రెస్‌ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు.

Updated : 30 Apr 2024 19:11 IST

అల్లాదుర్గం: భారత్‌ను కాంగ్రెస్‌ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. భాజపా ఎన్నికల ప్రచారంలో మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ‘‘ కాంగ్రెస్‌ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి చేస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న చోట పంచ సూత్రాలతో పాలన చేస్తుంది. ఆ పంచ సూత్రాలు.. అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబ పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావాలని ఆ పార్టీ చూస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణలో డబుల్‌ ‘ఆర్‌’ ట్యాక్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వ్యాపారులు, గుత్తేదార్లు దొడ్డిదారిలో ఈ ట్యాక్స్‌ కడుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వల్ల ప్రపంచమంతా గర్వపడితే.. డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌తో దేశం సిగ్గుపడుతోంది. పారిశ్రామిక వేత్తల నుంచి వసూలు చేస్తున్న ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌తో దిల్లీకి కప్పం కడుతున్నారు. గతంలో భారాస ఎలా అవినీతికి పాల్పడి తెలంగాణను దోచుకుందో.. ఇప్పుడు కాంగ్రెస్‌ అదే పని చేస్తోంది. దీనికి అడ్డుకట్ట పడాలంటే భాజపా అభ్యర్థులను గెలిపించాలి.

పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే మన వారసత్వ సంపద నుంచి  కొత్త ట్యాక్స్‌ వసూలు చేస్తామంటున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన దాంట్లో నుంచి 55శాతం ఆస్తి మన పిల్లలకు దక్కకుండా కాజేసేందుకు కుట్రలు పన్నుతోంది. ఇలాంటి భయానక నిర్ణయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాళేశ్వరం అతిపెద్ద కుంభకోణం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారాస దోచుకుందని అప్పుడు ప్రతిపక్షంలోఉన్న కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ భారాసను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అవినీతిలో ఈ రెండు పార్టీలు ఒక్కటే.

రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ రైతులను మోసం చేసింది..

రైతులను భగవత్‌ స్వరూపులుగా భాజపా చూస్తోంది. తెలంగాణలో 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్‌ రైతులను మోసం చేసింది. వరికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామన్న ఆ పార్టీ హామీ నెరవేరలేదు. పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలని కాంగ్రెస్‌ చూస్తోంది. హైదరాబాద్‌లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు. ఓ వర్గం వారి ఓట్ల కోసం మిగతవావారిని ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణను మొన్నటి వరకు  భారాస దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్‌ దోచుకుంటోంది. అయోధ్యలో రామమందిరం 500 ఏళ్ల భారతీయుల స్వప్నం. దిల్లీలో పటిష్ఠమైన ప్రభుత్వం లేక ఇన్నాళ్లూ ఆకల సాకారం కాలేదు. మీ అందరి సహకారంతో, మీరు వేసిన ఓటుతో అయోధ్యలో భవ్యమైన దివ్యమందిరం నిర్మాణం సాధ్యమైంది. మీరు వేసే ఒక్కొక్క ఓటుతో మీ కలలు సాకారం చేస్తాం. 

ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలం...

ఉమ్మడి ఏపీలో 2004-09లో రికార్డు స్థాయిలో కాంగ్రెస్‌ ఎంపీలను గెలిపించారు. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను ఆ పార్టీ ఏవిధంగా కాలరాసిందో కళ్లారా చూశారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్‌, మరాఠాలకు కాంగ్రెస్‌ న్యాయం చేయలేదు. 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా రాత్రికి రాత్రి ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చింది. ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలం కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ. అత్యయిక పరిస్థితి విధించిన చరిత్ర కాంగ్రెస్‌ది. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. రాజ్యాంగం అంటే విత్ర గ్రంథంగా భావిస్తాం. రాజ్యాంగంపై, అంబేడ్కర్‌పై కాంగ్రెస్‌కు గౌరవం లేదు. తొలి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తే.. ఇందిరగాంధీ తూట్లు పొడిచారు. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడింది భాజపా మాత్రమే’’ అని ప్రధాని మోదీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img