logo

రైతుబంధు రాకపాయె..!

యాసంగి రైతుబంధు లబ్ధి జాప్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు అయోమయంలో పడ్డారు. వీరి సంఖ్య దాదాపు 11 వేలు ఉంటుంది.

Updated : 31 Mar 2023 06:22 IST

ఆర్థిక సంవత్సరం ముగిసినా చేతికందని లబ్ధి

గరిడేపల్లిలో వరిసాగు

గరిడేపల్లి, మేళ్లచెరువు, న్యూస్‌టుడే: యాసంగి రైతుబంధు లబ్ధి జాప్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు అయోమయంలో పడ్డారు. వీరి సంఖ్య దాదాపు 11 వేలు ఉంటుంది. సుమారు 1.10 లక్షల ఎకరాలకు సంబంధించి రెండో విడత అందలేదని తెలుస్తోంది. దీనిపై అధికారులూ రైతులకు ఎలాంటి స్పష్టతనివ్వలేకపోతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నేటి (శుక్రవారం)తో ముగియనుండటంతో రైతులూ ఆందోళనకు గురవుతున్నారు.


వీరికి మాత్రమే..

రైతుబంధు పథకం లబ్ధిని ప్రభుత్వం రెండు విడతలుగా ఇస్తోంది. గడిచిన నాలుగు సీజన్ల నుంచి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మొదటి విడత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుండేవి. రెండో విడత పంపిణీ నవంబరు, డిసెంబరు నెలల్లో పూర్తి చేసేవారు. ఈ యేడాది వానాకాలం అలాగే కొనసాగించారు. యాసంగి జనవరి, ఫిబ్రవరి నెల 15 వరకు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. అవి ప్రాధాన్యం ప్రకారం పది ఎకరాల్లోపు వారికి లబ్ధి చేకూరింది. వీరితో పాటు 20 ఎకరాలు పైబడిన వారి ఖాతాల్లోనూ డబ్బులు జమయ్యాయని బాధితుల ఆరోపణ. లబ్ధి అందని వారిలో ఎటొచ్చీ పది నుంచి 20 ఎకరాల్లోపు వారే ఎక్కువగా ఉండడం గమనార్హం.


అధికారులకు ఫోన్లతో తలనొప్పి..

లబ్ధి జరగని రైతులు మాత్రం నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. జిల్లా స్థాయి అధికారుల వరకు నిత్యం ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అధికారులకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తలపట్టుకుంటున్నారు. రైతులకు స్పష్టతనివ్వలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధి చేకూరని వారి సంఖ్య దాదాపు 11 వేల మంది. వీరందరికీ మూడు నెలల నుంచి నిరీక్షణ తప్పడం లేదు. గత సీజన్లలో రెండు విడతలుగా ఇచ్చే రైతుబంధుతో రైతుల సంతృప్తి పడేవారు. ఈసారి మాత్రం యాసంగి విడత రాకపోవడం.. అది నేటితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.


ప్రభుత్వం దృష్టిలో ఉంది
- రామారావు, జిల్లా వ్యవసాయాధికారి, సూర్యాపేట

రైతుబంధు పథకం రెండో విడత చాలావరకు పంపిణీ జరిగింది. ఇంకా 3 వేల మంది రైతులకు అందాల్సి ఉంది. ప్రాధాన్యం ప్రకారం ఇప్పటివరకు రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. మా దగ్గర వివరాలన్నీ ప్రభుత్వానికి పంపాం. ఇంకా జమవ్వని ఖాతాల వివరాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని