logo

భాజపా అభ్యర్థులబయోడేటా

తొలిసారి 1999లో తుంగతుర్తి నుంచి తెదేపా తరఫున పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వర్‌రావు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Updated : 23 Oct 2023 05:32 IST

సూర్యాపేట: సంకినేని వెంకటేశ్వరరావు

తొలిసారి 1999లో తుంగతుర్తి నుంచి తెదేపా తరఫున పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వర్‌రావు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2004లో తుంగతుర్తి నుంచి 2009, 2014, 2018లో సూర్యాపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో భాజపాలో చేరారు. 2014లో సూర్యాపేట నుంచి పార్టీ టిక్కెట్‌ ఆశించినా పొత్తుల్లో భాగంగా తెదేపాకు ఇవ్వడంతో సంకినేని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అనంతరం 2018లో భాజపా నుంచి తొలిసారి పోటీ చేసి సుమారు 40 వేల ఓట్లు సాధించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. భాజపా తరఫున వరుసగా రెండోసారి సూర్యాపేట నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈయన స్వస్థలం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం.

భువనగిరి: గూడూరు నారాయణరెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి ఉద్యమాల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన గూడూరు నారాయణరెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. హైదరాబాద్‌ ఎస్‌వీ కళాశాల అధ్యక్షుడిగా పనిచేశారు. ఏఐసీసీ సభ్యుడిగానూ కొనసాగారు. రెండేళ్ల క్రితం భాజపాలో చేరి చేనేతలకు మగ్గాల పంపిణీతో పాటు పలు స్వచ్ఛంద సేవాసంస్థ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్న నారాయణరెడ్డి స్వస్థలం బీబీనగర్‌ మండలం గూడూరు.

నాగార్జునసాగర్‌: కంకణాల నివేదితరెడ్డి

ఇక్కడి నుంచి తొలిసారి 2018లో మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేశారు. ఈమె భర్త కంకణాల శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఆమెకు టిక్కెట్‌ ఇవ్వలేదు. తిరిగి ప్రస్తుతం రెండోసారి పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారు. తండ్రి తరఫు కుటుంబానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో 40 ఏళ్లుగా అనుబంధం ఉంది. నివేదిత సైతం ఆర్‌ఎస్‌ఎస్‌ మహిళా విభాగంలో కొంత కాలంగా చురుగ్గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పెద్దవూర మండలంలో గత కొన్నాళ్ల నుంచి స్పిన్నింగ్‌ మిల్లు వ్యాపారంలోనూ ఉన్నారు. ఈమె స్వస్థలం పెద్దవూర మండలం పులిచర్ల.

తుంగతుర్తి: కడియం రామచంద్రయ్య

గనులు, భూగర్భ వనరుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన రామచంద్రయ్య ఉద్యోగం తొలి దశలో కొన్నాళ్లపాటు ఉమ్మడి జిల్లాలోని చిట్యాల, వట్టిమర్తి లాంటి ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు. తొలిసారి 2018లో భాజపా నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం నాగారం మండల కేంద్రం. కొంత కాలంగా కడియం సోమక్క మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈనాడు, నల్గొండ- న్యూస్‌టుడే, భానుపురి, తిరుమలగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని