logo

అనుబంధాలు అల్లుకుందాం.. రండి

రోజురోజుకూ సాంకేతికత పెరుగుతోంది. మూడేళ్ల చిన్నారులు సైతం స్మార్ట్‌ఫోన్లు పట్టుకుని వీడియో ఆటలు ఆడుతున్నారు.

Updated : 30 Mar 2024 06:36 IST

రోజురోజుకూ సాంకేతికత పెరుగుతోంది. మూడేళ్ల చిన్నారులు సైతం స్మార్ట్‌ఫోన్లు పట్టుకుని వీడియో ఆటలు ఆడుతున్నారు. ఇదే సమయంలో కుటుంబ బంధాలు తగ్గిపోయి నైతికతను కోల్పోయి పక్క దారులు పడుతున్నారు. చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేక హింస, అరాచకాలకు పాల్పడటం, ఆత్మహత్యలు చేసుకుంటూ నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబంలో పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఒకే దగ్గరున్న నాలుగు మాటలు మాట్లాడుకోలేని పరిస్థితి. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు మానసిక, నైతిక, కుటుంబ బంధాల గురించి నేర్పాల్సిన అవసరముంది.

అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే: అన్నం పెట్టు.. ఫీజుకు డబ్బులు కావాలి.. నాకు ఫలానా వస్తువు కావాలి. ఇలాంటి సాధారణ అవసరాల కోసమే తప్పా ఆప్యాయతను పంచుకునే మాటలు నేడు కుటుంబాల్లో కరవయ్యాయి. పిల్లలకు తల్లిదండ్రులతో సాన్నిహిత్యం లేక భావోద్వేగ బంధం తగ్గిపోతోంది. టీవీలు, సామాజిక మాధ్యమాలకు పెద్దలు మొగ్గు చూపుతూ.. పిల్లల అడ్డు లేకుండా వీరికి ఓ స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్నారు. దీంతో వీరు హింసాత్మక వీడియో ఆటలు చూస్తూ అదే బాటలో ప్రయాణిస్తున్నారు. ఈ విధానం మారకపోతే పిల్లలు ప్రేమ, మానసిక విలువలకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

మాధ్యమిక విద్య.. మానవ విలువల చేర్పు..

ఇంటర్మీడియట్‌ దశ అన్నింటికీ కీలకం. మానసికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణమిది. ర్యాంకులు, మార్కుల ధ్యాసలో పడి మానవీయ విలువలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా చెడు వ్యసనాలకు బానిస కావడం, హింస మార్గంలో పయనిస్తూ సమాజానికి భారంగా మారుతున్నారు.

ఏదీ..నాటి వైభవం

రోజురోజుకు కుటుంబ బంధాలు క్షీణిస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకేచోట నానమ్మ, తాతయ్య, బాబాయి, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న ఇలా అందరూ కలిసిమెలసి ఉండేవారు. ఒకరికి కష్టమొచ్చినా అందరు పంచుకోవడంతో ఆ వ్యక్తిపై ఎలాంటి ఒత్తిడి ఉండేది కాదు. ప్రస్తుత కుటుంబ వ్యవస్థ వల్ల చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేక పోతున్నారు. పిల్లలకు మంచి చెడు చెప్పేవారు, ఆత్మస్థైర్యం నింపేవారు లేరు. చిన్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కుటుంబ బంధాలు బలంగా ఉండేలా చూడాలి.

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం  
-ఎం.డి అబ్బాస్‌అలీ, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీ ఉన్నత పాఠశాల, అడవిదేవులపల్లి

పిల్లలకు అన్ని విషయాలు బోధించినట్లు గానే నైతిక విలువలను ఒక పాఠంగా నేర్పాలి. దీనివల్ల ప్రాథమిక స్థాయి నుంచే నైతికంగా ఎదుగుతారు. మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేయాలి. మార్కులే భవిష్యత్తు అనే ధోరణిలో కాకుండా వీటికి సైతం తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.

నిరంతరం గమనిస్తూ ఉండాలి:
డాక్టర్‌ భవాని, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మిర్యాలగూడ

ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు పిల్లలపై ఒత్తిడి ఉంటోంది. తల్లితండ్రులు కుటుంబంలోని పెద్దలను గౌరవిస్తూ.. సమాజంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి పిల్లలకు పనుల్లో భాగస్వామ్యం కల్పిస్తూ తమతో గడిపేలాగా చూడాలి. పెద్దలను, గురువులను గౌరవించడం, తోటివారితో స్నేహంగా ఉండేలా నేర్పిస్తూ నిరంతరం గమనిస్తూ ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని