logo

శ్రీస్వామి కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ప్రత్యేక పూజలు

యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Published : 17 Apr 2024 06:12 IST

నిత్య కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న పూజారులు

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టాక మూలవరులను నిజాభిషేకం, తులసి పత్రాలతో ఆర్చన జరిపారు. ప్రధాన ఆలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మందిరంలో ప్రత్యేక ఆకుపూజ చేపట్టారు. మహాముఖ మండపంలో వేదమంత్ర పఠనాల మధ్య అష్టోత్తరం కొనసాగింది. శ్రీ లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణ పర్వాన్ని విష్వక్సేన ఆరాధనతో జరిపారు. గజ వాహనంపై అధిష్ఠించిన శ్రీస్వామి, అమ్మ వార్ల కల్యాణమూర్తుల సేవోత్సవాన్ని మాడవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం వేళ ఆలంకార జోడు సేవోత్సవాన్ని ఆలయ ఆచారంగా నిర్వహించారు. రాత్రి స్వయంభులను కొలుస్తూ ఆరాధన, సహస్రనామార్చన జరిపారు. ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా స్వామివారికి నిత్యాదాయం రూ.12,38,002 సమకూరిందని ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

పెరిగిన నారసింహుడి వార్షిక ఆదాయం

యాదగిరిగుట్ట అర్బన్‌: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం 2023-24 వార్షిక ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు ప్రకటనలో తెలిపారు. దేవస్థానం వార్షిక ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను ఆయన విడుదల చేశారు. రూ.224.25 కోట్ల ఆదాయం సమకూరగా రూ.214.55 కోట్ల వ్యయమైనట్లు తెలిపారు. రూ.9.70 కోట్లు మిగులు చూపారు. హుండీ కానుకల ద్వారా రూ.32.26 కోట్లు, సత్యనారాయణ వ్రతాలతో రూ.5.61 కోట్లు, ఇతర విభాగాలు అన్నీ కలుపుకొని మొత్తం రూ.224,25,87,229 సమకూరిందని పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది వేతనాలు, పింఛన్లకు రూ.35.83 కోట్లు, ప్రసాదాలు, సరకులకు రూ.26.96 కోట్లు, ప్రభుత్వానికి పన్నులు చెల్లింపులు రూ.20.72 కోట్లు, పొరుగు సేవలకు రూ.7.17 కోట్లు, విద్యుత్తు, నీటి నిర్వహణకు రూ.3.91కోట్ల ఇతర ఖర్చులతో మొత్తం రూ.214,55,85,249 వార్షిక వ్యయమైందని ఈవో వెల్లడించారు. 2022-23లో రూ.193.62 కోట్లు రాగా రూ.189.97కోట్లు వ్యయమైందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని