logo

అమ్మకానికి ఆడబిడ్డ.. అడ్డుకున్న పోలీసులు

రెండో కాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో ఆర్థికంగా భారం అవుతుందని.. పిల్లలు లేని వారికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు..

Published : 17 Apr 2024 06:23 IST

సూర్యాపేటలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే, చిత్రంలో పోలీసులు, ముసుగులో ఉన్న నిందితులు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: రెండో కాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో ఆర్థికంగా భారం అవుతుందని.. పిల్లలు లేని వారికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. కానీ నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి అందుకు అంగీకరించకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ పథకం రచించిన ఆ శిశువు తాతతోపాటు మరో ఐదుగురు నిందితులను మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ మేరకు సూర్యాపేటలోని తన కార్యాలయంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌ మండలం నాయకుని తండాకు చెందిన మేరావత్‌ పూల్‌సింగ్‌ తన కూతురికి మొదటగా ఆడబిడ్డ పుట్టగా.. రెండో సంతానంగా ఇరవై రోజుల కిందట మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. కుమార్తెకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో ఆమెకు ఆర్థికంగా భారం అవుతుందని పుట్టిన బిడ్డను పిల్లలు లేనివారికి విక్రయించి డబ్బులు సంపాదిస్తే బాగుపడుతుందని భావించాడు. అతని మేనకోడలు మేరావత్‌ దుర్గ గతంలో ఓ ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేసినప్పుడు పరిచయమైన షేక్‌ సైదమ్మ అలియాస్‌ సాయిబీ, ముడావత్‌ రాజానాయక్‌, శివనేని నాగమణితో పిల్లల్ని దత్తత చేసుకునే వారి గురించి విచారించాడు. విజయవాడకు చెందిన గరికముక్కు విజయలక్ష్మి, వాడపల్లి అశోక్‌కుమార్‌ మధ్యవర్తులుగా రూ.3 లక్షలకు ఆడపిల్లను విక్రయించేలా అంగీకారం కుదుర్చుకున్నాడు. వారు పాపను ఒకసారి చూసిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పి మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజి వద్దకు తీసుకురావాలని సూచించారు. తల్లికి మాయమాటలు చెప్పి పూల్‌సింగ్‌ సోమవారం అనుకున్న చోటుకి తీసుకొచ్చాడు. కూతురు చేతుల నుంచి బిడ్డను బలవంతంగా లాక్కొని విజయలక్ష్మి, అశోక్‌కుమార్‌కు ఇచ్చాడు. తల్లి గట్టిగా ప్రశ్నించడంతో పాపను తమకు విక్రయించినట్లు తెలిపారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. సహకరించిన నలుగురు నిందితులు షేక్‌ సైదమ్మ, బలగం సరోజ, గంజల సింధు, సరేశ్‌ పరారయ్యారు. ఈ మేరకు నిందితులను మంగళవారం రిమాండ్‌కు తరలించామని ఎస్పీ వివరించారు. స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ వీరరాఘవులు, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై అంజిరెడ్డి సీసీఎస్‌ ఎస్సై సాయి ప్రశాంత్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని