icon icon icon
icon icon icon

Chandrababu: కేజీఎఫ్‌-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు

జగన్‌ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Updated : 20 Apr 2024 22:29 IST

సర్వేపల్లి: జగన్‌ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఐదుగురు అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్‌, విజయసాయి, పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి దోచుకుంటుంటే ఆరో వ్యక్తి కాకాణి దోపిడీ యథేచ్చగా జరుగుతోందన్నారు.

‘‘ ఎండల బాదుడు కంటే వైకాపా బాదుడే ఎక్కువ. రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతోంది. మే 13న వైకాపా మాడి మసై పోతుంది. రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి. కేజీఎఫ్‌ -1, కేజీఎఫ్‌-2 చూడాలంటే కోలార్‌ పోవాలి. కేజీఎఫ్‌-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. కాకాణి దోచిన వనరులే ఆయన్ను రాజకీయ సమాధి చేస్తాయి. మైనింగ్‌ మాఫియాతో కొండలు, గుట్టలు ఏమీ మిగల్లేదు. క్వార్ట్జ్‌లో రూ.4,500 కోట్ల కుంభకోణం జరిగింది. విద్యాశాఖకు జగన్‌ తెగులు పట్టించారు. విద్యావ్యవస్థ భ్రష్టుపట్టే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో క్లాస్‌ వార్‌ కాదు.. క్యాష్ వార్‌ నడుస్తోంది. రాష్ట్రంలో డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి జగన్‌ ఊరికో ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. తెదేపా వచ్చాక పేదలకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తాం. వాలంటీర్లు ఎన్నికల్లో భాగస్వామ్యం కావొద్దని ఈసీ చెప్పింది. సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయవచ్చు.. అలా చేయకుండా వృద్ధులను ఎండలో తిప్పి ఇబ్బంది పెట్టారు. పెంచిన పింఛన్లు ఏప్రిల్‌ నుంచి ఇంటి వద్దే ఇస్తాం. దివ్యాంగులకు నెలకు రూ.6వేలు పింఛను ఇస్తాం. గొడ్డలి వేటు, కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడుతున్నారు. గులకరాయి వేయించి హత్యాయత్నం చేశానని చెబుతున్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్లీ మళ్లీ చెబుతున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img