logo

పోలీసుల అదుపులో మోసగాడు

ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాల్లో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ప్రబుద్ధుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. పోలీసు,

Published : 23 May 2022 04:52 IST

ఉద్యోగాల పేరిట టోకరా 

ఈనాడు, నిజామాబాద్‌: ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాల్లో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ప్రబుద్ధుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. పోలీసు, రెవెన్యూ, ఐసీడీఎస్‌ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్, అటెండర్‌ కొలువులు ఇప్పిస్తానంటూ నిర్మల్‌ జిల్లాకు చెందిన ఈయన పలువురిని బురిడీ కొట్టించాడు. సచివాలయంలో ఉద్యోగిగా పరిచయం చేసుకొని.. పోస్టుకు ఇంత మొత్తం అంటూ నిర్ణయించి మరీ దండుకున్నాడు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కదలికలపై నిఘా ఉంచారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆయన బంధువు ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నట్లు తెలుసుకుని.. శనివారం ఉదయం మఫ్టీలో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడిని నిజామాబాద్‌ తీసుకొచ్చి విచారిస్తున్నారు. వసూలు చేసిన డబ్బు ఏం చేశాడు? మోసాల వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విషయాలు తెలుసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. 

తప్పుదోవ పట్టించే ప్రయత్నం..

నిందితుడిపై కొన్నిరోజుల కిందటే కేసు నమోదు కావడంతో జాగ్రత్తపడ్డాడు. తెలివిగా వ్యవహరించి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. బాధితులకు ఫోన్లు చేస్తూ డబ్బు తిరిగిస్తానని చెప్పాడు. బాధితులకు తెలిసిన హైదరాబాద్‌లో తన చిరునామా మార్చేశాడు. కానీ బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఎలాగైనా హాజరుకావాల్సి ఉండటంతో ఇక్కడా తన తెలివిని వినియోగించాడు. పోలీసులకు అందుబాటులో ఉన్న బాధితులకు మళ్లీ ఫోన్‌ చేశాడు. తనకు గుండె జబ్బు సమస్య తలెత్తిందని, ప్రస్తుతానికి అనంతపురంలో ఉన్నట్లుగా తెలిపాడు. వైద్యుడి సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే వచ్చి కలుస్తానన్నాడు. పోలీసులకు ఈ సమాచారం వెళ్తే. ఎవరి దృష్టి పడదనుకున్నాడు. కానీ పోలీసులు మఫ్టీలో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. 

 రెండు జిల్లాల్లో బాధితులు..

రెండు జిల్లాల్లో బాధితులు ఠాణాల్లో ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయి. కానీ, అరెస్టు జాప్యమవుతూ వచ్చింది. నిజామాబాద్‌కు చెందిన బాధితులు అతడితో ఫోన్లో అందుబాటులో ఉండి కదలికలను పోలీసులకు చెప్పారు. వీరి నుంచే రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘తాను మరో మహిళా అధికారిణి నమ్మి డబ్బులు ఇచ్చానని.. ఆమె ఇప్పుడు పదవీ విరమణ పొందినట్లు’ నిందితుడు చెప్పినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని