logo

సదరం పత్రాలు దాచారు

సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో రోజుకో కొత్త అక్రమం వెలుగు చూస్తోంది. శిబిరంలో వైకల్యం నిర్ధారణై ధ్రువపత్రం మంజూరైనప్పటికీ పంపిణీ చేయకుండా కార్యాలయంలోనే ఉంచేశారు. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఇటీవల విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. సభ్యులు కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించగా

Published : 26 Sep 2022 02:27 IST

డీఆర్డీవో కార్యాలయంలో పదుల సంఖ్యలో లభ్యం

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో రోజుకో కొత్త అక్రమం వెలుగు చూస్తోంది. శిబిరంలో వైకల్యం నిర్ధారణై ధ్రువపత్రం మంజూరైనప్పటికీ పంపిణీ చేయకుండా కార్యాలయంలోనే ఉంచేశారు. అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఇటీవల విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. సభ్యులు కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించగా పదుల సంఖ్యలో ధ్రువీకరణ పత్రాలు బయటపడ్డాయి. వసూళ్ల కోసమే అర్హులకు పంపిణీ చేయకుండా దాచినట్లు భావిస్తున్నారు.

విచారణ పక్కదారి పట్టేలా..

మూడేళ్లుగా సదరం ధ్రువపత్రాల జారీలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్‌ పాటిల్‌ ఆదేశించినప్పటికీ కమిటీ సభ్యులు కేవలం ఆరు నెలల వివరాలు మాత్రమే ఇవ్వాలని కోరుతూ వైద్య విధాన పరిషత్‌ అధికారులకు లేఖ రాయడం గమనార్హం. అక్రమార్కులను కాపాడేందుకు పెద్దఎత్తున ఒత్తిడి వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

నిబంధనలకు తిలోదకాలు

వీటిని మండల పరిషత్‌, గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇక్కడ మాత్రం జిల్లాకేంద్రం నుంచే జరగడం గమనార్హం. మామూళ్ల వసూలుకే నిబంధనలకు తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత దందా జరుగుతున్నప్పటికీ పర్యవేక్షణ అధికారులు ఏం చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ధ్రువపత్రాల కోసం దివ్యాంగులు రోజూ కార్యాలయానికి వచ్చిపోతున్నారు. విచారణ సందర్భంగా బయటపడ్డ ధ్రువపత్రాలను ఇప్పటికైనా పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు