logo

Cheating: వివాహిత ఘరానా మోసం.. వధువుగా పరిచయమై..

భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్న వివాహిత.. ఓ యువకుడికి వధువుగా పరిచయమై అతనిని మోసం చేసిన ఘటన బోధన్‌ మండలంలో వెలుగు చూసింది.

Updated : 27 Aug 2023 09:17 IST

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్న వివాహిత.. ఓ యువకుడికి వధువుగా పరిచయమై అతనిని మోసం చేసిన ఘటన బోధన్‌ మండలంలో వెలుగు చూసింది. ముఖ పరిచయం లేకుండా ఏడాదిగా పెళ్లి చేసుకుంటానంటూ చెబుతూ అతని నుంచి రూ.4 లక్షలు తీసుకుంది. ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. తెలిసిన సమాచారం మేరకు.. బోధన్‌ ఉమ్మడి మండలానికి చెందిన ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమొనీలో పేరు నమోదు చేసుకున్నాడు. అందులో యువకుడి ఫోన్‌ నెంబరు తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైజాగ్‌కు చెందిన స్వాతి అనే మహిళ గతేడాది అక్టోబరులో తనను తాను పరిచయం చేసుకుంది. ఒకరి సమాచారం ఒకరు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో సదరు మహిళ వీడియోకాల్‌ ద్వారా యువకుడిని పలకరించింది. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇక్కడి వరకు సజావుగా కథ నడిపిన సదరు మహిళ తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానాలో ఉన్నానంటూ అత్యవసరంగా డబ్బు కావాలని యువకుడిని కోరింది. అప్పటి నుంచి క్రమంగా అవసరం మేరకు అతడిని డబ్బుల కోసం వాడుకుంటూ వచ్చింది. ఇలా రూ.4 లక్షలు కాజేసింది. పరిచయమై ఏడాది సమీపిస్తుండటంతో పెళ్లి చేసుకోవాలని యువకుడు ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె యువకుడి నెంబరు బ్లాక్‌ చేసింది. అనుమానం వచ్చి ఆరా తీయగా స్వాతి వివాహిత అని, ఇద్దరు కూతుళ్లు, భర్త ఉన్నట్లు తేలింది. ఈ విషయమై యువకుడు ఆమెను నిలదీయగా.. ‘మమ్మల్ని ఇబ్బంది పెట్టావు’ అని బెదిరిస్తూ ఎదురుదాడికి దిగింది. దీంతో కంగుతిన్న యువకుడు కోర్టును ఆశ్రయించి బోధన్‌ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. స్వాతి, ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు కలిసే మోసానికి పాల్పడినట్లు తేలింది. అప్పుడప్పుడు స్వాతి స్నేహితురాళ్లుగా యువకుడితో ఆమె కూతుళ్లే మాట్లాడినట్లు తెలిసింది. ఆమె కుటుంబమే ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని