logo

1.30 లక్షల మె.ట. కొనుగోళ్లు

ధాన్యం సేకరణ క్రమంగా ఊపందుకుంటోంది. ఇదివరకు రోజులో 5 వేల మెట్రిక్‌ టన్నుల మేర ఉండగా.. అది రెండింతలైంది. గడిచిన 15 రోజుల్లో 1.30 లక్షల మె.ట. మేర ప్రభుత్వం సేకరించింది.

Published : 16 Apr 2024 06:06 IST

ఊపందుకున్న ధాన్యం సేకరణ

కోటగిరిలో ధాన్యం తూకం వేస్తున్న అధికారులు, సిబ్బంది

ఈనాడు, నిజామాబాద్‌: ధాన్యం సేకరణ క్రమంగా ఊపందుకుంటోంది. ఇదివరకు రోజులో 5 వేల మెట్రిక్‌ టన్నుల మేర ఉండగా.. అది రెండింతలైంది. గడిచిన 15 రోజుల్లో 1.30 లక్షల మె.ట. మేర ప్రభుత్వం సేకరించింది. కిందటి వారం వరకు బోధన్‌ డివిజన్‌పైనే ఆధారపడినప్పటికీ.. ఆ ప్రాంతంలో ప్రైవేటు కొనుగోళ్లు అధికంగా ఉండి ప్రభుత్వ కేంద్రాలకు తక్కువగా పంట వచ్చింది. నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్లలోనూ 60-70 శాతం కోతలు పూర్తవడం.. ఇక్కడ సర్కారు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో కొనుగోళ్లు పెరిగాయి. వచ్చే రోజుల్లో మరింత ఊపందుకొని నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు సేకరణ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పరిశీలించేందుకు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ జిల్లాకు రానున్నారు. మంగళవారం కొనుగోలు కేంద్రాల పరిశీలన, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.

వాతావరణ ప్రభావం..

జిల్లాలో 11.70 లక్షల మె.ట. ధాన్యం వస్తుందని అధికారిక అంచనాలున్నాయి. ఇందులో 7 లక్షల మె.ట. మేర ప్రైవేటులోనే అమ్ముడవుతుందని చెబుతున్నారు. మిగతా 4.70 లక్షల మె.ట సేకరించే లక్ష్యంతో అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు 466 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బోధన్‌ డివిజన్‌లో మూడు మండలాల్లో ప్రభుత్వ ఏజెన్సీలకు ఎప్పుడూ లేనంతగా తక్కువ ధాన్యం వచ్చింది. కారణం..రైతులు పచ్చి ధాన్యాన్నే ప్రైవేటులో అమ్ముకుంటున్నారు. వాతావరణంలో మార్పులతో అకాల వర్షాలు అన్నదాతలను కొంత కలవరపెడుతున్నాయి. దీంతో నూర్పిళ్లు, ఆరబెట్టడం ప్రక్రియలతో ఆలస్యం జరిగి నష్టపోయే ప్రమాదం ఉందని ఈ మేరకు మొగ్గు చూపుతున్నారు.

ఇక వచ్చేది దొడ్డురకం

జిల్లాలో 65-70 శాతం సన్నాలు.. మిగతావి దొడ్డు రకం పండించారు. తొలుత కోతలు జరిగే బోధన్‌లో అత్యధికం సన్నాలు వేస్తుండటంతో ప్రైవేటు వ్యాపారుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిర్యాలగూడ, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంత మిల్లర్లు వచ్చి క్వింటా రూ.2100- 2200 వరకు పెట్టి కొనుగోలు చేశారు. రైతు అంగీకారంతో పచ్చి ధాన్యం క్వింటాకు 4.5 కిలోల తరుగుతో వ్యాపారులు సేకరించారు. ఆరబెట్టడం, నూర్పిళ్లకు కూలీల ఖర్చులు పెట్టేకంటే ఇలా చేయటమే మేలని చాలావరకు మొగ్గు చూపారు. దొడ్డు రకం సాగు చేసిన నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్లలో కోతలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఈ పంట ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రానుంది.

241 మిల్లులకు కేటాయింపు..

యాసంగి వడ్లు కావటంతో 61 ఉప్పుడు మిల్లులకు ప్రాధాన్యం ఇచ్చి సీఎంఆర్‌ కోసం ధాన్యాన్ని కేటాయించారు. మరో 180 ముడి బియ్యం మిల్లులకు ఈసారి కేటాయింపులు చేశారు. ఈ సంఖ్యకు సరిపడా 4.70 లక్షల మె.ట. సేకరణకు కార్యాచరణ కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. అయితే దొడ్డు రకాలు రావటం మొదలయ్యాక.. మరో 50 వేల నుంచి లక్ష మె.ట. మేర ధాన్యం అమ్మకానికి రావొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో అదనంగా మిల్లులకు కేటాయించటమా.. ప్రస్తుతం ఉన్న మిల్లుల కోటాను పెంచటమా అనేది నిర్ణయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని